కేసీఆర్ జాతీయపార్టీ పేరు మార్చేసిన ఎర్రబెల్లి.. ఆ వీడియోతో టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పేరును మారుస్తూ జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ఆవిర్భవించబోతుందని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాలలో దూకుడుగా ముందుకు వెళుతూ కేంద్రంలో అధికార బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశరాజకీయాలను చేయాలని ఉవ్విళ్ళూరుతున్న కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి గా పార్టీ పేరును మారుస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కెసిఆర్ దేశ రాజకీయాలను శాసిస్తారు అని చెబుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ పేరు మర్చిపోయిన మంత్రి ఎర్రబెల్లి .. బీఎస్పీ అంటూ వ్యాఖ్యలు
దేశ రాజకీయాల గతిని మార్చడానికి కేసీఆర్ జాతీయ పార్టీని పెట్టారని తాజాగా ప్రకటన చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ పేరును మర్చిపోవడం రాజకీయవర్గాలలో, ప్రజలలో చర్చనీయాంశమైంది. బిఆర్ఎస్ పార్టీ పేరు మరచిపోయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఎస్పీ పార్టీ ని పెట్టారని వరంగల్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి మాటలు విన్నవారు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. బీఎస్పీ మాయావతి పార్టీ కదా అని షాక్ తిన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మంత్రి వీడియో.. టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు
ఇక కేసీఆర్ ఏ పార్టీ పెట్టారు అని జనాలను ప్రశ్నించి బీఎస్పీ.. అని పదేపదే ప్రకటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ నాయకత్వ లక్షణాలను కొనియాడారు. ఇక మంత్రి ఎర్రబెల్లి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ సొంత పార్టీ నాయకులకే కెసిఆర్ పెట్టిన పార్టీ పేరు తెలియడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. జాతీయ రాజకీయాలను శాసించే దేశ్ కి నేత కెసిఆర్ పెట్టిన పార్టీని పార్టీ మంత్రులు కూడా గుర్తుంచుకోలేకపోతున్నారని బిజెపి, కాంగ్రెస్ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు.

మీ ముఖ్యమంత్రి పెట్టిన పార్టీపేరు గుర్తు పెట్టుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ నేతల హితవు
బిఎస్పికీ, బిఆర్ఎస్ కు తేడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి పెట్టిన పార్టీ పేరు, ఆ పార్టీలో పనిచేసే మంత్రికి కూడా తెలియదు, ఇక దేశ ప్రజలకు ఏం తెలుస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. దేశం కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది అని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడుతూ ముందు పార్టీ పేరు గుర్తు పెట్టుకోండి అంటూ చురకలు అంటిస్తున్నారు. కెసిఆర్ ని జాతీయ నేతగా ప్రచారం చేస్తున్న మంత్రులు, నేతలు ముందుగా కెసిఆర్ పెట్టిన పార్టీ పేరును గుర్తుంచుకోవాలని సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications