హరీష్‌పై ఎర్రబెల్లి, తప్పులేకుంటే ఎందుకని మోత్కుపల్లి
హైదరాబాద్: ఎస్ఆర్ఎస్పీ ఎడారిగా మారుతుంటే మామ కెసిఆర్, అల్లుడు హరీష్ రావు మహారాష్ట్రకు వెళ్లి ఏం సాధించుకుని వచ్చారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. కెసిఆర్ తప్పుడు నిర్ణయాలను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వంటి ఉద్యమకారులు ఎందుకు ప్రశ్నించరని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందిపెడితే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అన్యాయాలు జరిగితే అడిగేందుకు తెలంగాణ టిడిపి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
తెలంగాణ ద్రోహులను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేర్చుకుంటున్నారని తెలంగాణ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ వ్యతిరేకులకు ఆ పార్టీ పెద్ద పీట వేస్తోందని అంటూ తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అడిగారు. టిడిపి నుంచి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పదవి ఇచ్చిన కెసిఆర్ శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వడలేదని ఆయన అడిగారు.
తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మోసం చేశారని ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు వలన తెలంగాణ ఎడారిగా మారుతుంటే మహారాష్ట్ర వెళ్లి సీఎం కేసీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తప్పు చేసిందని సాక్ష్యం చూపితే నిలదీస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో దళితులకు ప్రాధాన్యం లేదని విమర్శించారు.

తుమ్మల, తలసాని తెలంగాణ కోసం పోరాడలేదని ఎర్రబెల్లి అన్నారు. సచివాలయంలో మీడియాను అడ్డుకోవడంపై ఎర్రబెల్లి స్పందిస్తూ మీడియాను అడ్డుకోవడం దురదృష్టకరమని తెలిపారు. దీనిపై అల్లం నారాయణ, కోదండరాం స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తప్పటడుగులను ప్రశ్నించండని ఎర్రబెల్లి కోరారు.
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కరీంనగర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు మౌలిక వసతులు కల్పించిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఎడారి కాబోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర 25 టిఎంసిల నీటిని తీసుకుపోతుంటే కెసిఆర్ ఎందుకు ప్రశ్నించరని అయన అడిగారు.
తెలంగాణ ప్రభుత్వం కోతల ప్రభుత్వమని మరో నేత పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. నీరు-విద్యుత్‌పై స్పష్టమైన ప్రణాళికలు లేవన్నారు. కేసీఆర్ తప్పటడుగులను ప్రజలు గమనిస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు.
తప్పు చేయకుంటే ఆంక్షలు ఎందుకు: మోత్కుపల్లి
తప్పు చేయకపోతే మీడియాపై ఆంక్షలు ఎందుకని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. మీడియా లేకపోతే ప్రజాస్వామ్యమే ఉండదన్నారు. ఇందిరాపార్కు దగ్గర నిర్వహించనున్న దీక్షను మార్చి 9కి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications