పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారంటే?
తాను బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని, పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల్లోకి వెళ్లే ముచ్చటనే లేదని స్పష్టంగా చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
మరోవైపు, మాజీ మంత్రి ఎర్రబెల్లిక ప్రధాన అనుచరుడైన వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రవీందర్ రావుతోపాటు ఆయన భార్య, ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి కూడా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుండటంతో మాజీ మంత్రి స్పందించారు.

తాను బీజేపీలో గానీ, కాంగ్రెస్ పార్టీలో గానీ చేరడం లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు.
బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు. ప్రతిపక్షంలో కూడా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది సీఎంలను కూడా ఎదుర్కొన్నాను. పార్టీలోకి రాకపోతే వర్ధన్నపేటను ఎస్సీ రిజర్వ్‌డ్ చేస్తాను.. ఎక్కడ పోటీ చేయనివ్వకుండా చేస్తానని రాజశేఖర్ రెడ్డి బెదిరించారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ, తనను పాలకుర్తి ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు అని ఎర్రబెల్లి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు. పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటాను అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications