ఒక్క వ్యక్తిపైన ఇన్ని కుతంత్రాలా - ఏకపక్షంగా : ఇవిఎం కూడా మార్చినట్టు - ఈటల ఫైర్..!!
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని మాజీ మంత్రి..హుజూరాబాద్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆరోపించారు. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదన్నారు. ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా .. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేస్తున్నాం. హుజురాబాద్ ప్రజల ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇది చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. కలెక్టర్ పొరపాటు జరిగింది అని చెబుతున్నారని... ఇది మామూలు ఎన్నిక కాదన్నారు.

ఈవీఎంల మార్పు ఆరోపణలు
ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యమా అని నిలదీసారు. ఇది చాలా నీచమైనదిగా ఈటల వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే లు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారని చెప్పారు. బస్సుల్లో ఈవీఎంలు కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈవీఎం పాడైందని మార్చడం అనుమానాలకు తెర లేపిందన్నారు. తనను ఓడించడానికి కెసిఆర్ అన్ని ప్రయత్నాలు చేశారని వివరించారు. డబ్బులు పంచారని.. మందు పంచారని.. బెదిరించారని.. మభ్యపెట్టారని చెప్పుకొచ్చారు. చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు.

గెలవలేక ఇలాంటి పనులు చేస్తున్నారంటూ
అన్నీ చేసినా గెలవలేక ఇలాంటి పనులు చేస్తున్నారని ఈటల ఆరోపించారు.ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరా హోరీగా సాగింది. కాగా, సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కవగా పోలింగ్ శాతం నమోదైంది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, ఈవీఎంలను మార్చారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అంతు చిక్కని ఓటరు నాడి.. విశ్లేషణలు
పోలింగ్ జరిగిన సమయం నుంచి ఈ ఘటన వరకు విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, తమ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కానీ, భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావటంతో ఎవరూ స్పష్టమైన విశ్లేషణ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత భారీ స్థాయిలో పోలింగ్ కు కారణమైందంటూ బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఇదే సమయంలో గులాబీ నేతలు మాత్రం ఇంకా ఫలితం పైన అంచనాల గురించి స్పందించ లేదు. పూర్తి స్థాయిలో పోలింగ్ పైన సమాచారం వచ్చిన తరువాత విశ్లేషణ చేసి అప్పుడు స్పందిస్తారంటూ కొందరు నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ విశ్లేషణలు ఎలా ఉన్నా..అసలు ఫలితం మాత్రం వెల్లడికావాలంటే మరో రెండు రోజులు నిరీక్షించాల్సిందే.












Click it and Unblock the Notifications