హుజూరాబాద్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపు ఖాయం: బండి సంజయ్
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజలు తమ పార్టీ సామర్థ్యాన్ని నమ్మి ఓటేయబోతున్నారన్నారు. బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుజూరాబాద్ ప్రజలను అయోమయానికి గురి చేయాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. దళితబంధు విషయంలో వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడతారన్నారు. అన్నపూర్ణగా తెలంగాణకు పేరుందని, వరి పంట వేయొద్దని చెప్పేందుకు మీరెవరని అధికారులను ప్రశ్నించారు. యాసంగి, వానా కాలం పంట కేంద్ర ప్రభుత్వం కొనలేదా? అని ప్రశ్నించిన ఆయన.. ఈసారి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు.
ముఖం చెల్లకే సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి రాలేదని బండి సంజయ్ విమర్శించారు. దళితబంధు 70 రోజులుగా ఎందుకు ఆపారని ప్రజలు నిలదీస్తారనే భయపడే రాలేదన్నారు. అధికారుల అండతో ఓటుకు రూ. 20 వేలు పంచడంతో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందన్నారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు.
హుజూరాబాద్ ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కేసీఆర్‌కు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అహంకార, అవినీతి పాలనను తరిమికొడతామన్న ఉత్సాహాన్ని తమకివ్వాలని బండి సంజయ్ ప్రజలను కోరారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్‌ను గెలిపిస్తారని అన్నారు.

మరోవైపు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరి కొనుగోలుపై మంత్రులు,ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారన్నారు. సిద్దిపేట కలెక్టర్ సుప్రీం కోర్టు ఆర్డర్ ను కూడా లెక్కచేయనంటున్నారన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ ఇప్పటికే సస్పెండ్ కావాల్సిందన్నారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తానన్న కేసీఆర్..ఇవాళ సీడ్ అమ్మితే జైల్లో వేస్తానంటున్నారన్నారని విమర్శించారు.
వరి విత్తనాలు అమ్మకపోతే.. గంజాయి అమ్మమంటారా? అని అరవింద్ ప్రశ్నించారు. తెలంగాణలో గంజాయి విపరీతంగా సాగైతుందన్నారు. యూత్‌కు సప్లై చేస్తున్నవారిలో టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని ఆరోపించారు. గంజాయి సప్లై చేస్తే జైల్లో వేస్తామని ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఆదేశాలివ్వలేదన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న కేసీఆర్.. ఇవాళ వరి వేయొద్దని.. మక్క వేయొద్దంటున్నారన్నారు. కోటి ఎకరాల మాగాణి.. లక్షన్నర కోట్ల కాళేశ్వరం మీ మామ ఫామ్ హౌస్ కోసమా?. ఖర్చు పెట్టేది దేని కోసం అని మంత్రి హరీశ్‌ను నిలదీశారు.
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ ది డ్రామా కంపెనీ అన్నారు. అమరవీరులకు కేసీఆర్ రోడ్డున పడేశారని విమర్శించారు. ఏడేళ్లుగా ఏం చేయని కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. ఈటలను గెలిపిస్తే తెలంగాణ పరువు నిలబడుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు విజయశాంతి.
Recommended Video
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున హుజురాబాద్ మండలం కాట్రపల్లిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకారం తగ్గాలంటే.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ను ఓడించాలన్నారు. ఫామ్ హౌస్‌లో పడుకొని.. కమీషన్లు దండుకోవడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారన్నారు. టీఆర్ఎస్ ఓటుకు ఆరువేలు పంచుతుందని వివేక్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామంటే కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఇంధన ధరలు భారీగా తగ్గేవన్నారు.












Click it and Unblock the Notifications