ఓటుతో దెబ్బ కొడితే ప్రగతి భవన్ లో కేసీఆర్ చెంప చెళ్ళుమనాలి : హుజురాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తి
హుజురాబాద్ లో నువ్వా నేనా అన్నట్టు ఎత్తులు పైఎత్తులతో ఉప ఎన్నికల రాజకీయం సాగుతోంది. ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హుజురాబాద్ కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో హుజురాబాద్ రాజకీయం రసవత్తరంగా ఉంది. హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ తీరుపై విరుచుకుపడుతున్నారు.

కావాలనే తనపై నిందలు మోపుతున్నారని మండిపడిన ఈటల
కెసిఆర్ పై ధ్వజమెత్తిన ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పతనానికి హుజురాబాద్ ఉప ఎన్నిక నాంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈటల రాజేందర్. ఈ క్రమంలో కేసీఆర్ పై మండిపడ్డారు .టీఆర్ఎస్ జెండాను తెలంగాణలో విస్తరింపజేసిన ఘనత తనదే అని పేర్కొన్న ఈటల తానేమీ అభివృద్ధి చెయ్యలేదని కావాలని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తాను తప్పు చేసినట్టు నిందలు వేసి బయటకు వెళ్ళగొట్టారని ఈటల ఆరోపించారు.

దమ్ముంటే గెలవాలని సవాల్ చేశారు.. అందుకే పోటీలో ఉన్నానన్న ఈటల
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం నాడు సమైక్య రాష్ట్రంలో ఎన్ని నిర్బంధాలు మోపినా ఆత్మ గౌరవ బావుటా ఎగరవేశానని పేర్కొన్నారు. తనను మోసం చేసి బయటకు పంపి దమ్ముంటే పోటీ చేసి గెలవమని సవాల్ చేశారని, ఆ సవాల్ ను స్వీకరించి వచ్చానని చెప్పారు ఈటల రాజేందర్. ఈ ఎన్నికలు కుల మతాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలని ఈటల రాజేందర్ తేల్చారు. ఏ కులపోళ్ళు, ఆ కులానికి ఓట్లు వేస్తే నడుస్తుందా అంటూ ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఎవరేంటో ఈనెల 30 వ తేదీన తేలిపోతుందని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలో డబ్బులు కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు.

హుజురాబాద్ లో 300కోట్లు పంచారని ఈటల ఆరోపణ
ఈ ఎన్నికలు తనపై వేసే చివరి పాశుపతాస్త్రం అంటూ చెప్పుకుంటున్నారని, ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు లొంగటం లేదని ఓటుకు 20 వేల నుండి 50 వేలు ఇస్తాడంట అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎన్నడూ రాని మంత్రులు కూడా డీసీఎం వ్యాన్లలో వచ్చి సారా సీసాలు పంచుతున్నారని ఈటల చెప్పారు. ఇప్పటికే హుజురాబాద్ లో 300కోట్లు పంచారని ఈటల ఆరోపించారు. ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారం 30 లక్షలు మాత్రమే ఖర్చు చెయ్యాలని,కానీ వెయ్యి కోట్లు ఖర్చు చేసి అయినా తనను ఓడించాలని కేసీఆర్ చెప్తున్నారని ఈటల మండిపడ్డారు.

పార్టీ ఫిరాయించిన వారు మనుషులైతే తన కోసమే పని చెయ్యాలన్న ఈటల
ఇది ఆత్మ గౌరవానికి కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం అని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భవన్ లో కూర్చొని తన గొంతు పిసికే కుట్రలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించిన ఈటల రాజేందర్ తన సహచరుడు హరీష్ రావు ఆ కుట్రలను అమలు చేస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు. తనతో ఉన్న వారు పార్టీ ఫిరాయించారని, వారంతా ఎందుకు ప్లేట్ ఫిరాయించారో మీకు తెలుసనీ పేర్కొన్న ఈటల వారు మనుషులైతే వాళ్ళు కూడా తన కోసమే పని చేస్తారని పేర్కొన్నారు.

తనది కారు గుర్తని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఈటల
తనకు ఓటేస్తే దళిత బంధు రాదనీ, పించన్లు పోతాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనకు ఓటేస్తే పథకాలు రాకుండా పోతాయా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉందంటే తనపై తానె దాడి చేయించుకుంటానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఓటుతో దెబ్బ కొడితే ప్రగతి భవన్ లో కేసీఆర్ చెంప చెళ్ళుమానాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్ ది కారు గుర్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనది కమలం పువ్వు గుర్తు అని చెప్పారు ఈటల.