కేసీఆర్.. విశాఖ స్టీల్ దాకా ఎందుకు.. నిజాం షుగర్స్ మాటేంటి? సింగరేణిపై చర్చకు సిద్ధమా!!
బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ మంత్రులను టార్గెట్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణపై తనతో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. కేంద్రం సింగరేణి ప్రైవేటీకరణ చేస్తుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. కావాలని బిజెపి మీద కెసిఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పాడిందే పాట అన్నట్టుగా అబద్దాల హోరు పెడుతున్నారని పేర్కొన్నారు.
ప్రధాని రామగుండంలో సింగరేణిని ప్రైవేట్ పరం చెయ్యం అని చాలా స్పష్టంగా చెప్పారని పేర్కొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రామగుండం ఎరువుల కర్మాగారం 6,300 కోట్లు ఇచ్చి పునరుద్ధరించింది కేంద్రమే అన్నది మరిచిపోవద్దన్నారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నా కూడా ఏనాడూ విధివిధానాలలో, పాలసీలలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావడం లేదని, మారోల్ లేనప్పుడు ఎలా ప్రైవేట్ పరం చేస్తాం అంటే ప్రభుత్వ సమాధానం లేదన్నారు.

సింగరేణి మీద చర్చకు సిద్ధమని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నానన్నారు. మన రాష్ట్రంలో ఉన్న నాలుగు మైన్స్.. కేకే6, శ్రవణపల్లి, కె ఓ సి-III, సత్తుపల్లి మైన్స్ కోసం 2019 లోపు సింగరేణి దరఖాస్తు చేసుకోలేదు. చేసుకొని ఉంటే కేంద్రం ఇచ్చేది. కాబట్టి కొత్త చట్టం ప్రకారం 2021లో ఈ నాలుగు మైన్స్ కు టెండర్లు పిలిచారని, సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం ముందే ఎందుకు దరఖాస్తు చేసుకోలేదు సమాధానం చెప్పాలన్నారు.
చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ చౌకబారు ప్రచారం చేస్తున్నారని, అది మానుకోవాలని హితవు పలికారు. ఇక ఈ వ్యవహారంలో అయితే బహిరంగ చర్చకు రండి, లేదంటే మాట్లాడడం మానేయండి అని పేర్కొన్నారు. కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్టు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటా అని నాలుగురోజులు డ్రామా ఆడారు. ఎందుకు టెండర్స్ వెయ్యలేదు అంటూ ప్రశ్నించారు ఈటల రాజేందర్.

వైజాగ్ దాకా ఎందుకు మన ఆర్టీసీ ని కాపాడాలన్నారు. తొమ్మిది వేల బస్సులు నాలుగు వేల బస్సులు ఎందుకు అయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్రం తెరిచింది.. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంగతి ఏమైంది అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చిన భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు ఈటల రాజేందర్.
మరోవైపు చేరికలపై ఈటల రాజేందర్ మాట్లాడారు. పొంగులేటి, జూపల్లితో 100% సంప్రదింపులు జరుపుతున్నామని వారు బిజెపిలో చేరడం ఖాయమని పేర్కొన్నారు. ఎక్కడ రాజకీయ భవిష్యత్ ఉంటే ఆ పార్టీలోనే నాయకులు చేరుతారని, తెలంగాణలో బిజెపికి భవిష్యత్తు ఉంది కాబట్టి వారు బీజేపీలో చేరతారు అన్నారు.












Click it and Unblock the Notifications