
ఈటలకు షాక్: టీఆర్ఎస్‌లోకి ఏనుగు రవీందర్ రెడ్డి..?
మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్వామిగౌడ్, దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరికొందరు నేతలు గులాబీ గూటికి చేరబోతున్నారు. అయితే ఈటల రాజేంధర్ ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీని వీడనున్నారని ఊహాగానాలు వస్తోన్నాయి. ఇదీ బీజేపీకే కాక.. ఈటల రాజేందర్‌కు షాక్.

ఈటలతో కలిసి..
ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్‌తో కలిసి పార్టీని వీడారు. ఈటలతో తుల ఉమ, తదితర ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనను పార్టీ పెద్దగా పట్టించుకోలేదు.

2018 ఎన్నికల్లో ఓటమి..
2018 ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోగా.. తనకు నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించారు. అదీ జరగలేదు. పైగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి జాజాలా సురేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం బాధ్యతలను టీఆర్ఎస్ నాయకత్వం సురేందర్‌కు అప్పగించింది. ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. అప్పుడు పార్టీని వీడటానికి ఇదీ కూడా ఒక కారణమే.

ఇవీ కారణాలు..
పార్టీ సభ్యత్వ నమోదులో కూడా ఏనుగు రవీందర్ రెడ్డికి ఏ విధమైన పాత్ర లేకుండా చేశారు. ఈటల రాజేందర్ వెంట నడవడానికి సిద్ధపడ్డారు. కానీ అదీ కూడా ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. తిరిగి ఆయన సొంత గూటికి చేరబోతున్నారు.

4 సార్లు ఎమ్మెల్యేగా
ఏనుగు రవీందర్‌రెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, యెర్రపహాడ్ గ్రామంలో జన్మించారు.1981లో యెర్రపహాడ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. 984లో నర్సాపూర్ లో ఇంటర్మీడియట్, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ లో 1986లో ఎస్.ఐ.టి.సి కోర్స్, ఉస్మానియా వర్సిటీ నుంచి బీఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత ప్రజా సేవ చేయాలని తలచి రాజకీయాల్లోకి వచ్చారు.