బీజేపీకి ఈటల గుడ్ బై అంటూ ప్రచారం.. ఆయన స్పందన ఇదే!!
బిజెపికి త్వరలో ఈటల రాజేందర్ గుడ్ బై చెబుతారని జరుగుతున్న ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేసిన ఈటల రాజేందర్ తాను పార్టీలు మార్చే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు నిజానిజాలు తెలుసుకోకుండా ఏవేవో రాస్తున్నారని, తన అభిప్రాయం తెలుసుకోకుండా ఇటువంటి వార్తలు రాయడం తగదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో తాను ఒక సైనికుడిలా పని చేస్తున్నానని ఈటల స్పష్టం చేశారు. తనకు బండి సంజయ్ కు మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఈటల బిజెపి నాయకుల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేశారు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కెసిఆర్ నియంతృత్వ పాలన అంతం చేయడం తన లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కెసిఆర్ ని గద్దె దించడం బీజేపీతోనే సాధ్యం అవుతుందని తాను నమ్ముతున్నానని అన్నారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేయడం కోసం అనుక్షణం అలుపెరగని పోరాటం చేస్తున్నానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ప్రజలను తప్పుదారి పట్టించే సమాచారాన్ని కొన్ని వార్తా పత్రికలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి నేతలందరూ ఏకమై నిరంతరం శ్రమిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొంతకాలంగా ఈటల రాజేందర్ బీజేపీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించడంతో ఆ ప్రచారం కాస్త జోరందుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ బాట పడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ బిజెపి ని వదిలి పెట్టి పోయేది లేదని తేల్చి చెప్పారు. కెసిఆర్ ను గద్దె దించే వరకు విశ్రమించేది లేదని, ఆ పని బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది అన్నారు. ఇది కావాలని తనపై జరుగుతున్న దుష్ప్రచారం అన్నారు.












Click it and Unblock the Notifications