రైతుల జోలికొస్తే మీ భరతం పడతాం: ఈటల రాజేందర్ వార్నింగ్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణలోని అధికార యంత్రాంగంపై బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శామీర్ పేట మండలం బొమ్మరాజుపేట రైతులకు మద్దతుగా శామీర్ పేట పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఈటల రాజేందర్ రైతుల ధర్నాకు అనుమతి ఇచ్చి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 ఏళ్ళ క్రితం రైతులు కొనుగోలు చేసుకున్న 1050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని, కేసీఆర్ బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో రైతులకు మద్దతుగా మాట్లాడిన ఈటల రాజేందర్ తెలంగాణా రాష్ట్రం వచ్చాక భూముల సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, పేదవారికి ఇబ్బంది లేకుండా భూప్రక్షాళన చేస్తా అని కెసిఆర్ చెప్పారని, విమర్శలు రావడంతో ధరణి తీసుకువచ్చారన్నారు.

ధరణి పేరుతో దేశానికే ఈ రాష్ట్రం ఆదర్శం చేస్తా అన్నారు కానీ ధరణి పేరుతో రైతుల కొంపలు ముంచుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కొంపలు ముంచడానికే ధరణి అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ బొమ్మరాజుపేట కేసు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సర్వే నంబర్ 323నుండి 409వరకు 1050ఎకరాల భూములలో 50ఏళ్లుగా రైతులు ఉంటున్నారని, రైతులంతా గ్రేప్ గార్డెన్ పెట్టుకున్నారు, పౌల్ట్రీ ఫాం పెట్టుకున్నారన్నారు.
ధరణి పేరు చెప్పి ఇప్పుడు కెసిఆర్, ఆయన బంధువులు, తాబేదారులు 50 ఏళ్ల కింద కొనుక్కున్న రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసిఆర్ ఎల్లకాలం నీ రాజ్యం నడవదని, మట్టిని నమ్ముకున్న రైతుల జోలికొస్తే నీ భరతం పడతామని హెచ్చరించారు. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు కుర్చీల్లో కూర్చుంది పేద రైతుల కోసమా? బ్రోకర్ల కోసమా? చెప్పాలని ప్రశ్నించారు. రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటారా ? అంటూ నిలదీశారు.
కేసీఆర్ పేదల కళ్ళలో మట్టి కొడుతున్నారని, కలెక్టర్ స్పందించక పోతే మీ సంగతి చూస్తాం అని హెచ్చరించారు. అధికారులు రైతులకు సెటిల్మెంట్ చేసుకోమని చెబుతున్నారని ఆరోపించారు. బ్రోకర్లుగా మారుతున్న అధికారుల భరతం పడతామని, రైతులకు అండగా ఉంటామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ధరణిలో లక్షల మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు.












Click it and Unblock the Notifications