ప్రీతి మృతితో వరంగల్లో తీవ్ర ఉద్రిక్తత: కేఎంసీ ముందు విద్యార్ధిసంఘాల ఆందోళన; అరెస్ట్!!
ప్రీతి మృతి చెందడంతో వరంగల్ నగరంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా నేడు కేఎంసి ముందు ఏబీవీపీ తో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనతో టెన్షన్ నెలకొంది.
కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడంతో వరంగల్ నగరంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నేడు విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద, కాకతీయ మెడికల్ కళాశాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చర్యలు చేపడుతున్నారు.

కేఎంసీ ముందు విద్యార్ధి సంఘాల ఆందోళన .. ఉద్రిక్తత
కాగా నేడు కేఎంసి ముందు ఏబీవీపీ తో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రీతి ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రిన్సిపాల్ , అనస్తీసియా విభాగం హెచ్వోడి పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళనకారులు ఆందోళన విరమించకపోవడంతో, పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ర్యాగింగ్ కు బలైన యువతి కుటుంబానికి న్యాయం జరగాలని విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కొనసాగుతున్న వైద్య కళాశాలల బంద్
సీనియర్ వైద్య విద్యార్థి వేధింపులతో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా వైద్య కళాశాలల బంద్ కొనసాగుతుంది. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని, వైద్య విద్య కళాశాలలో ర్యాగింగ్ సాధారణమైన అంశమని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. డాక్టర్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆల్ తెలంగాణ ట్రైబల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ప్రకటనలో కోరారు. ప్రీతి ఆత్మహత్యపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు.

పోలీసుల నిర్లక్ష్యం వల్లే అంటూ ఆరోపణలు
ప్రీతిని వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను ఉరితీయాలని, కళాశాలలలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు స్పందించాలని, పోలీసులు కూడా తక్షణం స్పందిస్తే ఇటువంటి ఘటనలు జరిగేవి కాదని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రీతి పై వేధింపులకు పాల్పడిన సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజులపాటు ఖమ్మం జైలుకు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనతో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.
కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ ఓడీ పై చర్యలకు విద్యార్ధి సంఘాల ఒత్తిడి
ఇక విద్యార్థినిపై వేధింపుల కేసు నమోదు కాగా, సైఫ్ ను కాకతీయ మెడికల్ కళాశాల సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రకటన వెల్లడించింది. నేరం రుజువైతే సైఫ్ అడ్మిషన్ రద్దు చేస్తామని కేఎంసి ప్రిన్సిపల్ మోహన్ దాస్ వెల్లడించారు. అయితే అసలు కెఎంసి కళాశాల ప్రిన్సిపల్ మరియు అనస్తీషియా విభాగాధిపతి నిర్లక్ష్యం వల్లే ఇంకా జరిగిందని, వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications