హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ మంత్రి గంగులకు ఈడీ నోటీసులు ; బేరసారాలు.. కట్ చేస్తే అంతా ఫేక్ !!
ఒకపక్క హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో పర్యటనలతో ప్రజాక్షేత్రంలో బిజీగా ఉంటున్న గంగుల కమలాకర్ కు గుర్తు తెలియని ఆగంతకులు నకిలీ ఈడీ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే హుజురాబాద్ ఎన్నికల సమయంలో కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేస్తూ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మరో మారు గంగుల కమలాకర్ కు ఈడి నోటీసుల పేరుతో వచ్చిన బెదిరింపులు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.

గతంలో గంగులకు సంబంధించిన గ్రానైట్ సంస్థలకు ఈడీ నోటీసులు
కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో గంగుల కమలాకర్ నిత్యం బిజీగా ఉంటున్నారు. హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలబడిన ఈటల రాజేందర్ కు చెక్ పెట్టడానికి గంగుల కమలాకర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో గంగుల కమలాకర్ కు సంబంధించిన శ్వేత ఏజెన్సీతో పాటుగా మరో ఎనిమిది ఏజెన్సీలకు ఇటీవల ఈడీ నోటీసులు జారీ చేసింది. బిజెపి ఎంపీ బండి సంజయ్ గతంలో కేంద్రానికి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో తాజాగా ఈడి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే .కరీంనగర్ జిల్లా వేదికగా గ్రానైట్ కంపెనీల అక్రమాలపై స్థాయిలో విజిలెన్స్ తనిఖీలు చేసి అక్రమాలను వెలుగులోకి తీసుకు రావడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది.

మరోమారు గంగులకు ఈడీ నోటీసులు , అరెస్ట్ చేస్తామని బెదిరింపులు
ఇదిలా ఉంటే తాజాగా మరోమారు ఈడీ నోటీసులు కలకలం ఆసక్తికరంగా మారింది . అయితే ఈసారి గంగుల కమలాకర్ కు జారీ అయిన ఈడీ నోటీసులు నకిలీ నోటీసులని తేలింది. గంగుల కమలాకర్ కు ఈడి నోటీసులు పంపించిన గుర్తు తెలియని అగంతకులు ఆయన సోదరులను అరెస్టు చేస్తామంటూ నోటీసులో పేర్కొన్నారు. ఇక అరెస్టు వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తామంటూ నోటీసులో తెలిపారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు .అయితే వారు పంపించిన నోటీసులు, ఫోన్ కాల్ సంభాషణలపై గంగుల కమలాకర్ కు అనుమానం వచ్చి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాన్ని సంప్రదించారు.

నోటీసులు తాము పంపలేదన్న ఈడీ .. కేసు నమోదు చేసి దర్యాప్తు
తాము ఎలాంటి నోటీసులు పంపలేదని ఈడీ అధికారులు చెప్పడంతో మంత్రి గంగుల కమలాకర్ ఖంగు తిన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఈడీ మంత్రి గంగుల కమలాకర్ కు నోటీసులు పంపిన వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. ఈడీ ఫిర్యాదు మేరకు 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, కెనడా నెంబర్ తో మంత్రి గంగుల కమలాకర్ కు కాల్స్ చేస్తున్నట్లుగా గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీసినా మంత్రి గంగుల వారితో ఏమీ చెప్పలేదని తెలుస్తుంది.

హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఫేక్ నోటీసులపై చర్చ
హుజురాబాద్ ఎన్నికల సమయంలో బిజీగా ఉన్న గంగుల కమలాకర్ ను టార్గెట్ చేస్తూ ఫేక్ ఈడీ నోటీసులు పంపించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు వివాదం వెనక ఎవరున్నారు? మంత్రి ని ఎవరు టార్గెట్ చేశారు? ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేరుతో నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? వంటి అన్ని అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల వేడి పీక్స్ లో ఉన్న సమయంలో గంగుల ను టార్గెట్ చేస్తూ ఫేక్ ఈడి నోటీసులు జారీ చేయడం, ఏకంగా తెలంగాణలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రిని లక్ష్యంగా చేసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది.












Click it and Unblock the Notifications