ఫేక్ యూనివర్సిటీ విద్యార్హత సర్టిఫికెట్ల దందా: కేయూ అధికారిక వెబ్‌సైట్ హ్యాక్; 12మంది అరెస్ట్!!
వరంగల్ కమిషనరేట్ పోలీసులు దేశంలో గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాకు చెందిన ఆరుగురు నిందితులతో పాటు, సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ గ్యాంగ్ లో మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.. వివరాలివే
అరెస్టు చేసిన వారి వద్ద నుండి పోలీసులు వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన 88 నకిలీ సర్టిఫికెట్లు, 9 నకిలీ సర్టిఫికెట్ల నమూనాలు, నాలుగు స్టాంపులు, హోలో గ్రామ్స్, 16 సెల్ ఫోన్లు, ఒక కలర్ ప్రింటర్, సిపియూ, 5లక్షల 37 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నర్సంపేట కు చెందిన ఆకుల రవి అవినాష్ ఆలియాస్ అజయ్ , భద్రాద్రి కొత్తగూడ కు చెందిన లంకల శంకర్ రావు , హనుమకొండ కు చెందిన మీరా అక్తర్ ఆలీ బెగ్ , జీడిమెట్ల కు చెందిన సుడిగ ఎల్లేష్, హైదరాబాద్ రామంతపూర్ కు చెందిన ముప్పురి పురషోత్తం, హైదరాబాద్ కు చెందిన కామన ప్రీతం, సికింద్రాబాద్ కు చెందిన ఐనవోలు సాయి శ్రవణ్, గుంటూరుకు చెందిన కోట అశోక్ , నల్గొండ కు చెందిన గండికొంట సందీప్, హైదరాబాద్ కు చెందిన మనోజ్ సింగ్, వనపర్తి కి చెందిన తల్లూరి సంప్రీత్, చిమరాల లక్ష్మీ ప్రసాద్ లు ఉన్నారు. కాగా బట్ట సందీప్, మెండి విజయ్ మరియు సర్వేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

ఈజీ మనీ కోసం టెక్నాలజీ వాడి ఫేక్ సర్టిఫికెట్ల దందా
ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ముఠాలో సభ్యులు సులువుగా డబ్బు సంపాదించడం కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకునే నకిలీ సర్టిఫికెట్ల ముద్రణకు శ్రీకారం చుట్టారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదవడం కోసం, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేయటం కోసం అవసరమైన విద్యార్హతల సర్టిఫికెట్లు అవసరమైన వ్యక్తులకు విక్రయించడం కోసం ఈ ముఠా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని విక్రయించటం మొదలుపెట్టింది.

కేయూ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేసి ఫేక్ సర్టిఫికెట్లు పొందిన వారి డేటా
దేశంలో వివిధ విశ్వవిద్యాయాలకు సంబంధించి మూడు సంవత్సరాల గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ఒక లక్ష రూపాయలకు ఈ ముఠా విక్రయిస్తుండగా, నాలుగు సంవత్సరాల ఇంజీనీరింగ్ మరియు ఆపై చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఈ ముఠా సభ్యులు లక్షన్నర రూపాయలకు విక్రయించేవారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ ముఠా మరొక పని అందరినీ షాక్ కి గురి చేస్తోంది. కాకతీయ యూనివర్సీటీకి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు పొందిన వ్యక్తుల వివరాలను ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు యూపి రాష్ట్రానికి చెందిన సర్వేశ్ ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేసి యూనివర్సిటీ వెబ్ సైట్లో నకిలీ సర్టిఫికెట్లను పొందిన వ్యక్తుల వివరాలను నమోదు చేసేవారు.

665కి పైగా వివిధ విద్యార్హతలకు సంబందించిన నకిలీ సర్టిఫికెట్ల విక్రయం
ఈ ముఠా కాకతీయ విశ్వవిద్యాలయము, అంధ్ర విశ్వవిద్యాలయము, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము, శ్రీవెంకటేశ్వర దేవర్య విశ్వ విద్యాలయము, అన్నం విశ్వవిద్యాలయము, శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయము, ఢిల్లీ విద్యాలయము, ఓపెన్ స్కూల్ కు సంబందించి ఇప్పటి వరకు 665కి పైగా వివిధ విద్యార్హతలకు సంబందించిన నకిలీ సర్టిఫికెట్లను విక్రయించడం జరిగింది.

నకిలీ సర్టిఫికెట్లను పొందిన 127 మందిని గుర్తించిన పోలీసులు
ఈ విధంగా ఈ ముఠా సభ్యుల ద్వారా నకిలీ సర్టిఫికెట్లను పొందిన 127 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగిందని, వీరి నుండి సర్టిఫికెట్లను కోనుగోలు చేసిన వ్యక్తులను గుర్తించి వారిని త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏ సి పి డా ఏం జితేందర్ రెడ్డి తోపాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications