రేపు కాలేజీలు రీ ఓపెన్..!
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు కోసం ఉన్నత విద్యాసంస్థలు తలపెట్టిన 'సాంత్వన సభ' పోరాటం సఫలమైంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో, ఈ నెల 8న (రేపు) జరగాల్సిన సభ, భారీ ర్యాలీలు వాయిదా పడ్డాయి.
ఫీజు బకాయిల సమస్య పరిష్కారం కోసం ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల వాతావరణం నెలకొంది.

విద్యాసంస్థలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.ఈ మొత్తంలో, మొదటి విడతగా అత్యవసరంగా రూ. 600 కోట్లు రానున్న రెండు రోజుల్లోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో, నవంబర్ 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించాల్సిన సాంత్వన సభ ,విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొనే భారీ ర్యాలీ కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది.
ఈ నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు, ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు పెద్ద ఉపశమనం కలిగించింది. గత కొంతకాలంగా నిధులు అందక విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికంగా తీరే అవకాశం ఉంది. ఈ నిధుల చెల్లింపుతో తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తిరిగి గాడిలో పడుతుందని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications