తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల సీఎస్‌లకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: తెలంగాణతోపాటు దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అధికారులు బదిలీలు, పోస్టింగులకు సంబంధించి జాతీయ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణతోపాటు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారుల(సీఈవో)కు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పోస్టులో మూడేళ్లకు మించి పనిచేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో తమ బంధువులు ఎవరు లేరని, తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని సూచించింది.

ఈ నిబంధనలు డీఈవోలు, డిప్యూటీ డీవోలు, ఆర్ఓ, ఏఆర్ఓ, ఈఆర్ఓ, ఏఈఆర్ఓతోపాటు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అన్ని స్థాయిల్లోని పోలీసులు అధికారులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి జులై 31లోగా ఈసీకి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పట్నుంచే ఎన్నికల ప్రచారానికి సిద్ధమైపోయాయి. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో వైఎస్ షర్మిల, బీఎస్పీ పార్టీతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇక ఎంఐఎం పార్టీ కూడా ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. దీంతో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీనే ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications