ఎవరికి లాభం?: రిటర్న్ పాలసీని మార్చిన ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్
హైదరాబాద్: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన రిటర్న్ పాలసీని మార్చింది. ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసే ఉత్పత్తులు నచ్చకుంటే కస్టమర్లు 30 రోజుల్లోగా వెనక్కు ఇచ్చే అవకాశం ఉండగా, దానిని ఇకపై 10 రోజులకు తగ్గిస్తుట్టుగా ప్రకటించింది. జూన్ 20 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని పేర్కొంది.
అంతేకాదు ఇదే రోజు నుంచి సెల్లర్స్‌కు చెల్లించే కమిషన్‌ను కూడా పెంచుతున్నట్లు పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేసిన వస్తువు తిరిగి వెనక్కు ఇవ్వాలనుకుంటే, ఏ ప్రశ్నా వేయకుండా తిరిగి డబ్బు చెల్లిస్తున్నందున సెల్లర్స్‌కు అదనపు నిర్వహణ ఖర్చుల భారం పెరుగుతుండటం దీనికి కారణంగా పేర్కొంది.

దీంతో పాటు కొంతమంది వినియోగదారులు నెల రోజులు పాటు తమ ఉత్పత్తులను వాడుకుని తిరిగి ఇస్తుండటంతో రిటర్న్ పాలసీని మార్చినట్లు తెలిపింది. దీనికి తోడు ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ నుంచి ప్రస్తుతం గట్టి పోటీని ఎదుర్కొవడమే ఇందుకు మరో కారణంగా పేర్కొన్నారు.
ఇటీవలే అమెజాన్ సైతం తన రిటర్న్ పాలసీని మార్చి సెల్లర్స్‌కు కమిషన్‌ను పెంచిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ తాజా నిర్ణయంతో సెల్లర్లు ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తుల ధరలను 9 శాతం వరకు పెంచుతున్నట్టు తెలిపారు. ఈ కొత్త రిటర్న్ పాలసీ ఎలక్ట్రానిక్స్, బుక్స్, మొబైల్ ఫోన్లు తదితరాలకు వర్తిస్తుందని తెలిపారు.
మరోవైపు దుస్తులు, పుట్‌వేర్, వాచీలు, జ్యూయల్లరీ, ఫ్యాషన్ ఉత్పత్తులపై 30 రోజుల రిటర్న్ పాలసీనే కొనసాగిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది. రిటర్న్ పాలసీపై తీసుకున్న తాజా నిర్ణయ ప్రభావం ఎలా ఉంటుందన్నది జూలైలోనే తమకు తెలుస్తుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
రిటర్న్ పాలసీ మారడం వల్ల సెల్లర్స్ వ్యాపారం మరింతగా పెరగడంతో పాటు అమ్మకాలు కూడా మరింతగా పెరుగుతాయని తాము భావిస్తున్నట్లు ప్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తామిచ్చే కమిషన్, ఫీజుల విధానం ఇతర ఈ-కామర్స్ కంపెనీలతో పోటీ పడుతోందని, లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications