భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి- రెండో ప్రమాద హెచ్చరిక: ఏజెన్సీ గ్రామాలతో సంబంధాలు కట్..!!
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తుతోంది.
మరో రెండు రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని, మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాల ధాటికి అతలాకుతలం అయ్యాయి. మున్ముందు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతిభారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలన్నింటికీ సెలవును ప్రకటించింది ప్రభుత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ సహా ఎనిమిది జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, యాదాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. దీనితో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేసింది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ధాటికి గోదావరి పోటెత్తింది. బుధవారం రాత్రి 9:30 గంటల సమయానికి భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వరద ప్రవాహం 48 అడుగులకు చేరింది. దీనితో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం.. వంటి మండలాల వెళ్లే రహదారులపై వరదనీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లతో మాట్లాడారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల తీవ్రత మరో 48 గంటల పాటు ఉంటుందని, పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications