కేసీఆర్ ఫాంహౌస్‌లో ఏం చేస్తారో తెలుసా: దేవేంద్ర ఫడ్నవీస్ ఫైర్, ఏకిపారేసిన బండి సంజయ్
వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర పాదయాత్రలో శనివారం మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ చేపట్టిన 'ప్రజా సంగ్రామ యాత్ర' తెలంగాణలో రాజకీయ మార్పు తీసుకువస్తుందన్నారు.
షాంహౌస్‌లో కేసీఆర్ చేసే పని అదేనంటూ ఫడ్నవీస్
తెలంగాణ సీఎం కేసీఆర్.. కేవలం తన కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని ఫడ్నవీస్ ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌజ్లో కూర్చొని మాట్లాడితే.. బండి సంజయ్ మాత్రం రైతుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నారని అన్నారు. వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డి పేటలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో ఫడ్నవీస్ పై వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ రైతుల మధ్య కూర్చుని వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. కేసీఆర్ ఎప్పుడైనా రైతులతో కూర్చున్నరా? మీరే ఒకసారి ఆలోచించండి. సీఎం ఫాంహౌజ్లో కూర్చొని పథకాలను రచించి ఏ విధంగా దోపిడీ చేయాలో ప్రణాళిక రూపొందించి దోచుకుంటున్నారు. సీఎం కేసీఆర్ అనేక సబ్సిడీలను నిలిపేశారు. ధరణిని అమలు చేయడం లేదు. రుణమాఫీ పూర్తిగా ఇవ్వడంలేదు. రైతుల సర్కార్, ప్రజాస్వామిక సర్కార్ రావాలంటే బండి సంజయ్ పాదయాత్రను ఆశీర్వదించాలని కోరుతున్నా. తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంద దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.
ఎకరానికి కోటి సంపాదించేది కేసీఆర్ ఎక్కరే ఎందుకు?
సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. రైతులు పంటగిట్టుబాటకాక నష్టపోతుంటే.. కేసీఆర్ ఏమో ఎకరానికి కోటి సంపాదిస్తున్నడట. గంజాయి గిట్ల పండిస్తున్నడేమో అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆయన పాదయాత్ర వికారాబాద్ చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు, పేదల ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. 2023లో మీ ఆశీస్సులతో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. పేదల ప్రభుత్వాన్ని తీసుకొస్తం. ఈ రోజు డబుల్ బెడ్రూం, రుణమాఫీ, ఫ్రీ యూరియా అని కేసీఆర్ కోతలు కోస్తున్నడు. ఒక్కటి కూడా అమలు చేయలేదని బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి.. మిగిలిన అన్ని సబ్సిడీలు బంద్ చేసిండు. అద్బుతాలు సృష్టిస్తానన్నాడు. కానీ స్ప్రింకర్ల సబ్సిడీ, పాలీహౌజ్ సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ బంద్ చేసిండు. చివరకు రుణమాఫీ చేస్తనన్నడు. బ్యాంకులో వేసుకున్న సొమ్మును కూడా బ్యాంకు వాళ్లు లాక్కుంటున్నారు. రైతులు హరిగోస పడుతున్నారు. కేసీఆర్కు వందలాది ఎకరాల ఫాంహౌజ్ ఉంది. ఆయన ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తుండట. మరి ఏం పండిస్తుండో.. గంజాయి గిట్ట పండిస్తున్నడేమో. ఆయన ఫాంహౌజ్లో సాయిల్ టెస్ట్ చేసుకుంటడు. దొడ్డు వడ్లు పండిస్తడు. కానీ రైతులు మాత్రం సన్న వడ్లు పండించాలని చెప్తడు. పండించిన పంటను మీ బావుల దగ్గరే కొని మీ ఇంటికే డబ్బులు పంపిస్తామని చెప్పిన కేసీఆర్ అవేమీ చేయలేదు. రైతులు ధాన్యం అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాలవద్ద పడిగాపులు పడి నానా గోస పడుతున్నరని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
Recommended Video
ప్రజల నోట్లో మట్టికొట్టిండు అంటూ కేసీఆర్‌పై బండి ఫైర్
రైతే రాజు అని మనం అంటుంటాం. కానీ, రైతు బికారిగా మారిండు. తన కొడుకును రైతుగా చేయడానికి ఏ రైతు ఇష్టపడటం లేదు. ఇట్లయితే దేశానికి అన్నం పెట్టేవాళ్లెవరు? పంట నష్టం వస్తే వివరాలు తీసుకెళుతున్నారే తప్ప సాయం మాత్రం చేయడం లేదు. ధరణి పెద్ద స్కాం. ఎవరి పట్టా, ఎవరి స్థలం, ఎవరి పేరు మీద ఉందో అంతా గందరగోళం. ఓ పెద్దాయన ప్రాణహిత చేవెళ్ల డిజైన్ పేరిట కాల్వలు తవ్వి డబ్బులు దొబ్బుకుపోయిండు. ఈయన వచ్చి రీ డిజైన్ పేరు మీద అంచనాలు పెంచి కోట్లు దండుకున్నడు. ఈ ప్రాంతానికి నీళ్లు మాత్రం రాలేదు. అందరూ కలిసి ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టిండ్రు అని కేసీఆర్‌పై బండి సంజయ్ అన్నారు. రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం తెచ్చింది. కౌలు రైతు సహా ప్రతి రైతు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్త్తోంది. మరి కేసీఆర్ కౌలు రైతులకు ఎందుకు రైతుబంధును అమలు చేయడం లేదు? కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ ప్రాంతంలో 1,30,895 మందికి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 244 కోట్ల రూపాయల నిధులిచ్చింది. విత్తనాల కోసం రూ. 4 కోట్లు, క్రిషి సంచాయి యోజన కింద మరికొన్ని కోట్లు ఇచ్చిందని బండి సంజయ్ వివరించారు.












Click it and Unblock the Notifications