ఏపీ పరిణామాలపై తెలంగాణ మాజీ ఐపీఎస్ ఆందోళన
RS Praveen Kumar: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫైర్ సర్వీసులు, విపత్తుల నిర్వహణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీసుకోదలిచిన క్రమశిక్షణ చర్యల వ్యవహారం కాక రేపుతోంది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం కొట్టివేసిన కేసులో పీవీ సునీల్ కుమార్‌పై చంద్రబాబు ప్రభుత్వం ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తోన్నానంటూ ఓ పోస్ట్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆయనపై గతంలో గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.

తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సునీల్ కుమార్‌పై బదిలీ వేటు పడింది. పోస్టింగ్ లభించలేదు.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కొంతకాలం పాటు ఆయన సీఐడీ డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఆయన సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడే రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో అధికారులు తనను కొట్టారని, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ తాజాగా ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ పేరు సైతం చేర్చారు.
తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, అయదుమంది గుర్తు తెలియని వ్యక్తులతో హింసించారంటూ అప్పట్లో రఘురామ కృష్ణంరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. తనను కొడుతున్నారనడానికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా తీశారని, దాన్ని వైఎస్ జగన్‌కు చూపించారని రఘురామ ఆరోపించారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేశారని చెప్పారు.
ఈ కేసు, పోలీసులకు రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచిన అంశాలపై తాజాగా పీవీ సునీల్ కుమార్‌పై స్పందించారు. ఈ కేసు అప్పట్లో సుప్రీంకోర్టులో మూడు సంవత్సరాల పాటు నడిచిందని గుర్తు చేశారు. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమే దీన్ని తిరస్కరించిందని పేర్కొన్నారు.
అలాంటి కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఏమనాలో తనకు తెలియట్లేదని వ్యాఖ్యానించారు. వాళ్ల విజ్ఞతకే వదిలి వేస్తోన్నానని పేర్కొన్నారు. నగరపాలెంలో కేసు నమోదైన తరువాత దీన్ని డిలెట్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్లపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది. 15 రోజుల్లోగా సంతృప్తికర వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.
సునీల్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, భారత్ రాష్ట్ర సమితి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. ఆయనపై ప్రభుత్వ దాడిగా అభివర్ణించారు. ప్రవీణ్ కుమార్ ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముందని ప్రశ్నించారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా' అని అనడం సర్వీసు రూల్ ఉల్లంఘన ఎట్లవుతుందని నిలదీశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవాలని, అప్పుడైనా విషయం అర్థం అవుతుందేమోనని సూచించారు.












Click it and Unblock the Notifications