తన బర్తరఫ్ వెనుక ఏం జరిగిందో.. కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్!
బీసీ మహిళా నేతనైన తనను మంత్రి పదవి నుండి తొలగిస్తూ అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కొండా సురేఖ పేర్కొన్నారు. కక్ష కట్టి కుట్ర చేసి తనను తొలగించేలా చేశారని ఆమె ఆరోపించారు. తాజాగా మంత్రిగా తనను బర్తరఫ్ చేయటానికి సీఎం రేవంత్ గవర్నర్ కు లేఖ పంపటంపై మీడియా సమావేశం నిర్వహించిన కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక్క మాట కూడా చెప్పకుండా బర్తరఫ్ చేస్తారా: కొండా సురేఖ
తనకు ఒక్కమాట కూడా చెప్పలేదని, నేరుగా భర్తరఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో కూడా ఉరివేస్తున్నాం..అని చెప్తారు.. చివరికొరిక ఏమైనా ఉందా అని అడుగుతారు.కానీ కావాలని కక్ష కట్టి కుట్ర చేసి తిరుపతి రెడ్డి... తదితరులు..నన్ను తీసేయించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

బర్తరఫ్ చేసిన వారిలో మల్లు రవి.. పార్టీని తిట్టలేదా
సుమంత్ విషయంలో కూడా అంతా కుట్ర చేసారన్నారు. సుమంత్ పేరు చెప్పి నేరాలు సెటిల్మెంట్లు చేసి కావాలని బద్నాం చేశారని మండిపడ్డారు. సుమంత్ కేసును సీసీఎస్ కు బదిలీ చేసి టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారన్నారు. నేను మంత్రిగా ఉండగా మా ప్రభుత్వంలో ఇంత జరుగుతోందని ఆమె అన్నారు. ఎవరైతే నన్ను బర్తరఫ్ చేయించారో, వారిలో మల్లు రవి ఉన్నాడు.. ఆయన పార్టీని తిట్టలేదా అని ప్రశ్నించారు.
యాబై కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొన్నాడని తిట్టిన వారినేం చేశారు
మాజీ సీఎం రోశయ్య ఏకంగా విధవ రాజ్యం ఏలుతోందని ఇందిరాగాంధీని తిట్టాడని గుర్తు చేశారు.యాబై కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొన్నాడు అని తిట్టిపోసిన వాళ్ళని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రజలనుండి రాజకీయాల్లో పైకి వచ్చాం... ప్రజలకే మేం జవాబుదారీగా ఉంటామని కొండ సురేఖ పేర్కొన్నారు.కడియం శ్రీహరి కూడా నాగురించి మాట్లాడుతున్నాడని, ఆయనపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.
నాకు జరిగిందే మీకు జరుగుతుంది.. మంత్రులనుద్దేశించి కొండా సురేఖ
నా కూతురు అంటే నన్ను తీసేస్తారా..?నాకు చెప్పాపెట్టకుండా నన్ను తీసేస్తారా..? అంటూ ప్రశ్నించిన సురేఖ సహచర మంత్రులుగా ఉన్నవారికి నాకు జరిగిందే మీకు జరుగుతుంది అని పేర్కొన్నారు.ఇబ్బంది పడుతున్న నేతలారా.. బయటకు రండి.. గళం విప్పండి అంటూ పిలుపునిచ్చారు.ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై నోరు విప్పాలన్నారు.లేదంటే నష్టం తప్పదని హెచ్చరించారు.
మంత్రులందరూ సంతోషంగా ఉన్నారా? గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి
మంత్రులందరూ సంతోషంగా ఉన్నారా?.. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలని కొండా సురేఖ సవాల్ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ సంతోషంగా లేరనే విషయం అందరికీ తెలుసన్నారుఇప్పటికైనా అందరూ బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని ఆమె సూచించారు. ప్రజలకు సేవ, అభివృద్ధి చేయలేకపోతున్నామనే బాధ అందరిలో ఉందని, పనులు జరగాలంటే ఎవరివద్దకు వెళ్లాలో తెలియని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని కొండా సురేఖ ఆరోపించారు. ఇస్తామన్న హామీలు నెరవేర్చకపోవటం వల్ల ప్రజల్లో వ్యతిరేఖత ఉందన్నారు.
ఎన్నికలు వస్తున్నాయ్.. మోనోపోలీ వ్యవహారం తప్పు
నా పదవి తీసేయడం వేరు.. నాకు ముందే చెప్పాల్సిందన్నారు. బీసీ రిజర్వేషన్లు మేము చేశాం అంటున్న సీఎం రేవంత్ ఒక బీసీ మహిళ మంత్రి పదవి ఎలా తీసేసారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం సర్దుకోవాలని, తమ పంధా మార్చుకోవాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మోనోపోలీ వ్యవహారం తప్పు అన్నారు.నేను పదేళ్లు సీఎం అని ఆయనకు ఆయన చెప్పుకోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు.
అధిష్టానాన్ని రేవంత్ బ్లాక్ మెయిల్ చేసి తనను తొలగించారు
ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం తప్పు కాదా అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్ చేసి తనను తొలగించారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగానే ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని, తనపై తీసుకున్న నిర్ణయం తప్పని, తన బర్తరఫ్ ను ఖండిస్తున్నానని సురేఖ అన్నారు.












Click it and Unblock the Notifications