మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత, రేవంత్, బాబు సంతాపం
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం మరణవార్త తెలియడంతో తెలంగాణలోని రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951, మే 22న మందా జగన్నాథం జన్మించారు. ఆయన నాలుగు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. 1996, 1999, 2004, 2009లో ఎంపీగా విజయం సాధించారు. మూడుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి, ఒకసారి కాంగ్రెస్ తరపున ఆయన విజయం గెలుపొందారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ ఆయన సేవలందించారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన బీఎస్పీలో చేరారు.

మందా జగన్నాథం మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారునిగా మందా జగన్నాథం పాత్ర మరువరానిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారని రేవంత్ కొనియాడారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటని అన్నారు.
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికైన మందా జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివిని జగన్నాథం.. టీడీపీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచి ప్రజా సేవ చేశారని కొనియాడారు. జగన్నాథం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.












Click it and Unblock the Notifications