స్నేహితుడికి ప్రేమ పెళ్లి చేసి.. నలుగురు మిత్రుల ఆత్మహత్యాయత్నం!
మెదక్/కరీంనగర్: వేధింపులు భరించలేక నలుగురు యువకులు సామూహికంగా ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా నవాబుపేటలో చోటు చేసుకుంది. ఈ నలుగురు యువకులు ఇటీవలే తమ స్నేహితుడి ప్రేమ వివాహం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని వేధిస్తున్నట్లుగా భావిస్తున్నారు.
మెదక్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన శంకర్, అదే గ్రామానికి చెందిన శివరంజని ప్రేమించుకున్నారు. వీరిద్దరు గత పదిహేను రోజులుగా కనిపించడం లేదు. దీంతో, శంకర్ నలుగురు స్నేహితుల పైన శివరంజని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా రాంగోపాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ నలుగురు స్నేహితుల పైన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో, పోలీసులు గత ఏడు రోజులుగా విచారణకు పిలుస్తున్నారని తెలుస్తోంది. మరోసారి విచారణకు రావాలని ఆదేశించారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో హఠాత్తుగా వారు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సమీపంలోని శంకరపల్లి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తమను వేధిస్తారనే ఉద్దేశ్యంతోనే వారు ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మొదట హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఒకరిని కరీంనగర్ ఆసుపత్రికి, మిగతా ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ నలుగురు తన స్నేహితుడు శంకర్, శివరంజనిలకు పెళ్లి చేసి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications