తెలంగాణాలో వారికి ఉచిత బస్సులు.. పరిశీలిస్తున్న రేవంత్ సర్కార్!
తెలంగాణలో సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిన్న ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
అయితే అర్హతలు, స్కీమ్ నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రంగా చర్చించి, అవసరమైన మార్గదర్శకాలు రూపొందించనుంది. ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు కూడా ఇలాంటి సౌకర్యం కల్పిస్తే పురుషులు సహా వయోవృద్ధులందరికీ లబ్ధి చేకూరుతుంది.

రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 32.69 లక్షల మంది వృద్ధులు ఉండగా, ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 60 ఏళ్లు పైబడినవారు సుమారు 12.5 శాతం ఉన్నారు. అంటే దాదాపు 48 లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నట్లు అంచనా. 2031 నాటికి ఈ శాతం 14.5కి, 2036 నాటికి 17.1కి చేరుతుందని రిజర్వ్ బ్యాంక్ నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే వృద్ధుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. చేయూత పెన్షన్ కింద సుమారు 15.60 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ అందుతోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 30 డే-కేర్ సెంటర్లు పని చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం 10 వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. జెరియాట్రిక్ కేర్‌కు 1,700 మందికి శిక్షణ ఇచ్చే ప్రణాళిక కూడా ఉంది. ఎల్డర్ లైన్ 14567 ద్వారా వృద్ధుల సమస్యలకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమించి వారి ఫిర్యాదులు పరిష్కరించాలని సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఇలాంటి నేపథ్యంలో ఉచిత బస్ పాస్ సౌకర్యం అదనపు మద్దతు ఇవ్వనుంది.
వయసు పెరిగే కొద్దీ ప్రయాణ ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఉచిత పాస్ వస్తే ఆసుపత్రులు, బంధువుల ఇళ్లు, దేవాలయాలు వంటి చోట్లకు సులభంగా వెళ్లే అవకాశం కలుగుతుంది.మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్లు అర్హతలు, వయసు పరిమితి, ఆదాయ పరిమితి వంటి నిబంధనలు ఖరారు చేసిన తర్వాతే స్కీమ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.













Click it and Unblock the Notifications
