ఉచిత బస్సు పథకం ఎఫెక్ట్.. ప్రభుత్వానికి ఆర్టీసీ కొత్త ప్రతిపాదనలు!
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరి ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఆర్టీసీ బస్సుల పైన ఆధారపడే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక సాధారణ రోజుల్లో కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య రద్దీని తట్టుకోలేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్న ఆర్టీసీ
ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించడం కోసం కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని సూచనలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో 200లకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

500 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు
500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, అలాగే 12 కొత్త బస్సు టెర్మినల్స్ ను నిర్మిస్తామని హైదరాబాద్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడించారు.2025 - 2026 ఆర్థిక సంవత్సరానికి గాను 500 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేర్కొన్నారు.
12 కొత్త బస్సు టెర్మినల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు
హైదరాబాద్ నగరంలో 12 కొత్త బస్సు టెర్మినల్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపారు. మహాలక్ష్మి పథకం కారణంగా బస్సులలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని, కొత్తగా ఏర్పడుతున్న కాలనీలలో అవసరాలకు అనుగుణంగా కూడా తమ బస్సు సర్వీసులను నడుపుతున్నామని ఆయన తెలిపారు. 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని, ఖమ్మంలో 225 బస్సులు ఆగస్టు నాటికి రాష్ట్రానికి చేరుకున్నాయని, మిగిలిన 275 బస్సులు దశలవారీగా వస్తాయని ఆయన వెల్లడించారు.
ఈ ప్రాంతాలలో కొత్త బస్ టెర్మినల్స్
నవంబర్ నెలలో 50 బస్సులు, డిసెంబర్ నెలలో 50 బస్సులు, జనవరిలో 50, ఫిబ్రవరిలో 50, మార్చిలో 75 బస్సులు నగరానికి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. హైటెక్ సిటీ, బాలానగర్, జీడిమెట్ల, కూకట్పల్లి, లింగంపల్లి, కాళీ మందిర్ , వేవ్ రాక్, కెపిహెచ్బి, ఐఎస్ సదన్, ఘట్ కేసర్, గండి మైసమ్మ, ఉప్పల్ వంటి ప్రాంతాలలో కొత్త బస్సు టెర్మినల్స్ నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆమోదిస్తే పనులు షురూ
ఈ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆమోదిస్తే నిధుల లభ్యతను బట్టి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా బస్సులు వినియోగం పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలలో రద్దీకి తగినట్టుగా వివిధ డిపోల నుండి అదనపు ట్రిప్పులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.












Click it and Unblock the Notifications