ఉచిత విద్యుత్ మా హక్కు.. వాడుకుంటాం: తిరగబడ్డ తెలంగాణా తండా
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాద్ జిల్లాలోని ఒక తండా వాసులు విద్యుత్ అధికారుల పై తిరగబడ్డారు. ఉచిత విద్యుత్తు మా హక్కు మేము వాడుకుంటాం అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా విద్యుత్ వినియోగం చేస్తున్నారని, స్తంభాలపై తీగలను వేసి అక్రమ విద్యుత్ ను ఉపయోగించుకుంటున్నారని, తండాలోని వారి ఇళ్లకు వేసుకున్న కరెంటు తీగలను కట్ చేసిన అధికారులపై తండావాసులు తిరగబడ్డారు.

అక్రమ విద్యుత్ వైర్లను కట్ చేసిన విద్యుత్ శాఖ సిబ్బంది.. తిరగబడ్డ తండా వాసులు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్య తండాలో విద్యుత్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన వైర్లను కట్ చేశారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులను అడ్డుకున్న తండావాసులు, అధికారులు కట్ చేసి తీసుకు వెళుతున్న కరెంటు తీగలను లాక్కున్నారు. ఈ క్రమంలో తండా వాసులకు విద్యుత్ శాఖ అధికారులకు మధ్య పెద్ద గొడవ జరిగింది. తండావాసులు విద్యుత్ శాఖ అధికారులతో ఉచిత విద్యుత్ తమ హక్కు వాడుకుని తీరతాం అంటూ తేల్చి చెప్పారు.

ఉచిత విద్యుత్ తండాలకు ఇస్తామన్న ప్రభుత్వం .. వాడుకోవటం హక్కన్న తండా వాసులు
అలా కరెంట్ అక్రమంగా వాడుకోవటం నేరమని ఫైన్ వేస్తామని, కేసులు పెడతామని విద్యుత్ శాఖాధికారులు హెచ్చరించారు. కానీ తండా వాసులు ఉచిత కరెంట్ వాడుకు తీరుతామని తేల్చి చెప్పారు. వారు ఆ విధంగా చెప్పడం వెనుక ఓ బలమైన కారణాన్ని కూడా చూపిస్తున్నారు. తండాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్తు తీసుకోవడం తమ హక్కని తండా వాసులు విద్యుత్ అధికారులతో గొడవ పడ్డారు.

విద్యుత్ అధికారులు కట్ చేసిన తీగలను లాక్కున్న తండా వాసులు .. అధికారులు షాక్
మేము ఉచిత విద్యుత్ వాడుకుని తీరతాం .. ఇక్కడి నుంచి వెళ్ళిపొండి అంటూ విద్యుత్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యుత్ శాఖాధికారులు కరెంట్ తీగలు వేసుకున్న ట్రాలీ నుండి వారు తమ కరెంట్ తీగలను తీసుకువెళ్ళారు. తండావాసుల చర్యకు, వారు అధికారులతో చెప్పిన విషయాలకు అవాక్కవడం విద్యుత్ అధికారుల వంతయింది. మరి ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖ అధికారులు ఏం చెయ్యబోతున్నారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications