హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !!
హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వాగ్యుద్ధం మొదలైంది. వాహనదారుల అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే వాదనను బీజేపీ నాయకులు లేవనెత్తుతున్నారు. రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ పనులు కొన్ని ప్రాంతాల్లో నత్తనడకన నడుస్తోండటం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
ఈ క్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అంబర్‌పేట్ ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ ఫ్లైఓవర్ కింద భూసేకరణలో తీవ్ర జాప్యం జరగడం వల్లే సర్వీస్ రోడ్డు నిర్మాణం నిలిచిపోయిందని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా భూసేకరణ ప్రక్రియను అడ్డుకుంటున్నారని, ఇది పనులకు ఆటంకం కలిగిస్తోందని తెలిపారు.

ఈ అనవసర జాప్యం వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2.54 కోట్లు చెల్లించినప్పటికీ, కొందరు బ్రోకర్లు భూసేకరణ ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను గత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం తెలంగాణ మంత్రులతో పలుసార్లు మాట్లాడారని పేర్కొన్నారు.
తాను స్వయంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులతో చర్చించినా, ఈ విషయంలో ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోవట్లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఫ్లై ఓవర్ 2018లో మంజూరు అయినప్పటికీ లేని సమస్యలు సృష్టించి భూసేకరణ పూర్తి కాకుండా కుట్రలు చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరగనివ్వకపోవడంతో ఈ రహదారి గుండా ప్రయాణించే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
భూసేకరణకు సంబంధించిన 2.54 కోట్ల రూపాయల పరిహారం లబ్దిదారునికి ప్రభుత్వం చెల్లించినప్పటికీ మధ్య దళారులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ చూపించి, సర్వీసు రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత జీహెచ్ఎంసీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకొని సర్వీస్ రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించటానికి సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications