ప్రగతిభవన్‌లో వినాయక చవితి వేడుకలు: కేసీఆర్, కేటీఆర్ దంపతుల పూజలు
హైదరాబాద్: వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. గణనాథుడికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రార్థించారు.
గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ - శైలిమ దంపతులు, కూతురు అలేఖ్య పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడు
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు, ప్రఖ్యాత ఖైరతాబాద్ మహా గణపతి కొలువుదీరాడు. 63 అడుగుల మహా గణపతికి తొలి పూజ జరిగింది. గణేశుడు ఈసారి 'శ్రీ దశమహా విద్యా గణపతి'గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామివారికి కుడి వైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమవైపున వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు భక్తులు పోటెత్తారు.
11 రోజులపాటు ఘనంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు మహా గణపతికి తొలి పూజ జరిగింది. ఈ పూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచే మహా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు, అక్కడ ఏర్పాటు చేసిన చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతకుముందు ఖైరతాబాద్ గణనాథుడికి భారీ లడ్డును నిర్వాహకులు సమర్పించారు. ఈసారి 63 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీదశమహా విద్యాగణపతికి మొదటగా పద్మశాలి సంగం తరపున పట్టువస్త్రాలు, గరికపూస, వెండి జంజాన్ని నిర్వాహకులు సమర్పించారు.

ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications