ఆ ఇద్దరు ఆడవాళ్లు ఎంత చెబితే అంత: నయీం కేసులో నిందితులు వీరే?
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో నిమిషానికో నిజం వెలుగులోకి వస్తోంది. నయీం అనుచరులకు సంబంధించి రిమాండ్ రిపోర్టు మీడియాకు వెల్లడైంది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నయీం అనుచరులైన 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య హసీనా, సోదరి సలీమా సహకారంతో నయీం డాన్‌గా మరింతగా రెచ్చిపోయినట్టు తెలుస్తోంది.
దందాల్లో సోదరి సలీమా, భార్య ఎంత చెబితే అంత అని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిజం చెప్పాలంటే సయీం గ్యాంగ్ స్టర్‌గా మారడానికి సోదరి సలీమా ఎంతో కీలకమని పోలీసులు అంటున్నారు. సమాజంలో మనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకోవాలని, అడ్డు వచ్చిన వారందరినీ నరుక్కుపోవాలంటూ సలీమానే నయీంకు చెప్పేదంట.
నయీం దందాల్లో సలీమా కీలకపాత్ర పోషించేది. స్కెచ్చులు, స్పాట్‌లు పెట్టడంలో కూడా సలీమాది అందెవేసిన చేయి. సోదరి ప్రోత్సాహంతో ఫయీం అంతకంతకు రెచ్చిపోయేవాడు. నయీం అనుచరుల్లో కీలక నిందితుడిగా శ్రీధర్ గౌడ్‌ను పోలీసులు భావిస్తున్నారు. నయీం సెటిల్ మెంట్లన్నీ శ్రీధర్ గౌడ్ పూర్తి చేసేవాడని పోలీసులు విచారణలో వెల్లడైంది.

వనస్థలిపురం పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఏ1 నిందితుడిగా నయీం, ఏ2గా ఫయీం, ఏ3గా శ్రీధర్ గౌడ్, ఏ4గా కల్వకుర్తికి చెందిన గంధం శామ్యూల్స్, ఏ5 షేక్ ఫయాజ్, ఏ6 మహమ్మద్ షమీయుద్దీన్, ఏ7గా నయీం భార్య హసీనా బేగం, ఏ8గా సాజిదా షహీం, ఏ9గా బలరాం గౌడ్, ఏ10గా సీహెచ్ సుధాకర్, ఏ11గా రాపాటి వెంకటేశ్ గౌడ్, ఏ12గా రాపాటి కరుణాకర్ గౌడ్, ఏ13గా దోర్నాల శ్రీను, ఏ14గా శ్రీధర్ రాజు, ఏ15గా ముషాబాద్‌కు చెందిన ఆశీఫ్, ఏ16గా అశోక్ అలియాస్ టెక్ మధు ఉన్నారు.
నయీం స్నేహితుడు, లాయర్ వెంకటేశ్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఏ3 నిందితుడిగా ఉన్న శ్రీధర్ గౌడ్, ఏ9గా ఉన్న బలరాం గౌడ్‌లను వనస్థలిపురం పోలీసులు కస్టడీకి కోరారు. మొత్తం నయీం అనుచరులు 16 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మరో 14 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.
వీరంతా కూడా బలవంతపు వసూల్లు, బెదరింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వనస్థలిపురంలోని భవానీ ఎన్‌క్లేవ్‌లో ఫయీం నివసించేవాడని, నయీం దందాల్లో చాలా వరకు ఇక్కడ నుంచి జరిగేవని పోలీసులు వెల్లడించారు. వీటితో పాటు నయీం కబ్జా ద్వారా పెద్ద ఎత్తున భూములను స్వాధీనం చేసుకున్నాడు.
గ్యాంగ్ స్టర్ నయీం హతంతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. తాజాగా హైదరాపూర్-వరంగల్ రహదారిలోని ఔషాపూర్ వద్ద సుమారు 200 వరకు ప్లాట్లను నయీం ఆక్రమించుకున్నట్లు బాధితులు మీడియా ముందుకొచ్చారు. ఇప్పుడు వీరంతా నయీం హతంతో మీడియా ముందుకొచ్చారు.