ఇల్లు సీజ్, ఆస్తుల చూసి అధికారులు షాక్: 2నెలలుగా అమ్మాయిపై నయీం లైంగిక దాడి

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీం ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. సోమవారమంతా నయీం ఇంట్లో, అతని బంధువుల ఇంట్లో పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

హైదరాబాదులోని అలకాపురిలోని నయీం ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు భారీ ఎత్తున నగదు, స్థిరాస్తులకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదును కౌంటింగ్ మిషన్లతో లెక్కపెట్టిన పోలీసులు ఆ నగదు విలువను రూ.2.5 కోట్లకు పైగానే ఉన్నట్లు తేల్చారు.

నయీం ఇంటిలో 2 కిలో బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. పట్టుబడ్డ స్థిరాస్తుల పత్రాల విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మేర భారీ స్థాయిలో ఆస్తులు పట్టుబడటంతో ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు.
ఆస్తులతో అధికారులు విస్తు

నయీంకు కొండాపుర్లో 69 ఎకరాల భూమిని గుర్తించారు. నల్గొండ జిల్లాలోని బొమ్మాయిపల్లిలో వందల ఎకరాలు గుర్తించారు. హైదరాబాదు సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లు గుర్తించారు. మొత్తం లెక్కలు తేలాలంటే ఇంకా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆస్తులను చూసి అధికారులే విస్తుపోతున్నారు. కాగా, పోలీసులు నయీం కుటుంబ సభ్యుల పైన చీటింగ్, కిడ్నాప్, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

ఇతర రాష్ట్రాలల్లోను ఆస్తులు

నయీం నివాసాల్లో పోలీసులు సోదాలు పూర్తయ్యాయి. నయీం ఐదు రాష్ట్రాల్లో వేలాది కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. బంధువుల ఇళ్లలో వందల సంఖ్యలో సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. పోలీసులకు చిక్కకుండా సిమ్‌లు, చరవాణులు మార్చినట్లు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌ పుప్పాలగూడ ఇంట్లో భారీగా ద్విచక్రవాహనాలు, సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడ ఇంట్లో రెండు పెంపుడు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. నయీం పెంపుడు కుక్కలకు సంబంధించిన మెనూ చార్ట్‌ను గుర్తించారు.

మిర్యాలగూడలోని నయీం అత్తవారింట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. 362 స్థిరాస్తి పత్రాలు, రూ.4.6లక్షలు, 100 చరవాణులు, తుపాకి స్వాధీనం చేసుకున్నారు. నయీం భార్య, అత్త, బావమరిది సాదిక్‌పాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఎలాంటి విచారణకైనా సిద్ధం: నయీం కుటుంబం

నయీం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. భువనగిరిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తరలించారు. అంతకుముందు, పోస్టుమార్టం నిర్వహించిన షాద్ నగర్ ఆసుపత్రి వద్ద అతని బంధువులు గుమికూడారు. తమకు నయీం మృతదేహాన్ని అప్పగించాలని కంటతడి పెట్టుకుంటూ చెప్పారు.

తాము ఎలాంటి విచారణకైనా సహకరిస్తామని చెప్పారు. నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బును, ల్యాండ్ డాక్యుమెంట్లను పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్లో పరిశీలిస్తున్నారు.

పోలీసుల అదుపులో అనుచరులు

నల్గొండ జిల్లాలో నయీం అనుచరులు ఐదుగురుని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఇద్దరు, వలిగొండలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

వెంకటేశ్‌ నుంచి తపంచా, 4 రౌండ్ల తూటాలు, విలువైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాజర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాజర్‌ నుంచి తపంచా, నాలుగురౌండ్ల తూటాలు, రూ.71వేలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.వలిగొండలో కొనపురి శంకర్, శ్రీశైలం, గుండు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 Gangster Nayeem's home raided, assets worth crores recovered

ఉలిక్కిపడిన అల్కాపురి

నయీం ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగా నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని అల్కాపురి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంత వాతావరణానికి నిలయమైన అల్కాపురిలో షాద్ నగర్ ఎన్‌కౌంటర్ అలజడి రేపింది. సోమవారం ఉదయం 9.30 గంటల మొదలైన పోలీసుల హడావిడి అర్థరాత్రి వరకు కొనసాగింది.

తెలంగాణ ప్రత్యేక పోలీసులతో పాటు నార్సింగి పోలీసులు, ఎస్‌వోటీ పోలీసులు 12 గంటల పాటు నయీం ఇంట్లో సోదాలు జరిపారు. అల్కాపురి కాలనీలో నయీం ఇల్లు ఉందని తెలుసుకున్న స్థానికులు ఆ ఇంటిని చూసేందుకు బారులు తీరారు. సోదాలను శంషాబాద్ డీసీపీ సంప్రీత్ సింగ్, ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. సాయంత్రం సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్ నవీన్‌చంద్ కూడా సందర్శించారు.

నయీం గత ఐదు నెలలుగా అల్కాపురిలో నివాసం ఉంటున్నాడని తెలుస్తోంది. 2013లో అమర్‌జీవా రెడ్డి పేరుపై ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నట్లు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉంది. కానీ ఇంటి విద్యుత్ మీటర్ మాత్రం సాజిద్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి.

ఈ ఇంటి స్థలాన్ని కూడా నయీం బినామీ పేరు మీద తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న యజమాని అక్రమంగా పెంట్ హౌజ్‌ను నిర్మించారు. పోలీసుల సోదాల్లో వందలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి.

రెండు క్యాష్ కౌంటింగ్ యంత్రాలతో డబ్బులు లెక్కించారు. ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు పదికి పైగా బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని గుర్తించారు. నయీం లావాదేవీలు, సెటిల్మెంట్లపై ఓ రికార్డు బుక్, సీడీలు బయటపడ్డాయి.

ఈ ఇంటిలో మొత్తం 11 మంది నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. నయీం, అతని భార్య, బావమరిది, అతని భార్య, ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగ పిల్లలు ఉంటారని తెలిసింది. ఇందులో నయీం సంతానం ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, బావమరిది సంతానం ఇద్దరు మగపిల్లలు ఉన్నారని తెలుస్తోంది.

ఆ ఇంట్లో దొరికిన వారి పేర్లు.. ఫార్హానా, (40), ఆసియానా (38), సలీమ్ పాషా, రేష్మా (19), నాజియా (17), సమీరా (10), నబీరా (12). వీరితోపాటు నయీం కుమారులు దిల్షా ఉద్దీన్ (12), అల్లాఉద్దీన్ (14), కూతురు సాహా (8) ఉన్నారు.

నయీం ఇంట్లో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు మూడు ప్యాకెట్ల జిలిటిన్ స్టిక్స్‌తో పాటు మూడు దేశవాళీ తుపాకులు, ఒక చైనా కంపెనీ తుపాకీ లభించాయి. ఇంట్లో గల ఎనిమిది గదులను, వాటర్ ట్యాంక్‌తోపాటు సంప్‌లను కూడా జల్లెడ పట్టారు.

తనిఖీల్లో నయీం జీవితానికి సంబంధించిన కొత్తకోణం బయటపడింది. అతడి గదిలో పలు నీలి రంగు చిత్రాల సీడీలు దొరికాయి. 250 ఫోన్‌లు, 300 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో మరో బాధితురాలు పోలీసులకు చిక్కింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆ అమ్మాయిని తీసుకొచ్చి రెండు నెలలుగా నిర్బంధ లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+