వేడెక్కిన గ్రేటర్: తగ్గిన సైకిల్ స్పీడ్, సెటిలర్లపై కారు ఆశలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల వాతావరణం రాజుకుంటోంది. ప్రధాన రాజకీయ పక్షాలు సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహరచనలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అవుతూ, అదే సమయంలో హైదరాబాదీలకు ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకోవడానికి తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు ఆ దిశగానే సాగుతున్నాయి.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది తేలక ముందే స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి గ్రేటర్ హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడేట్టు చేశారు. కాలనీ ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి డివిజన్‌కు ఒక అధికారిని నియమించి ప్రజలతో సమావేశం జరిపి, సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో గుర్తించిన పనుల కోసం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు.
గ్రేటర్ పరిధిలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే గెలిచారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అసలు పోటీ చేయలేదు. కానీ, ప్రతిపక్షాల శాసనసభ్యులను సాధ్యమైనంత వరకు తన వైపు లాక్కుంది. కానీ తెలంగాణ ఏర్పడి టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ పరిధిలో తనకు అనుకూలంగా వాతావరణాన్ని మలుచుకోవడానికి కసరత్తు చేస్తోంది.
గ్రేటర్‌కు అనుకొనే ఉన్న సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డును కైవసం చేసుకుంది. 1983 నుంచి టిడిపి అనేక సార్లు అధికారంలోకి వచ్చినా కంటోన్మెంట్ బోర్డును మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్ అధీనంలోనే ఉంది. అలాంటిది కాంగ్రెస్, టిడిపి- బిజెపి కూటమిని ఓడించి పోటీ చేసిన తొలిసారే బోర్డును టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

పాతబస్తీలో పూర్తిస్థాయి పట్టు ఉన్న ఎంఐఎం ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతోంది. ఎక్కడికక్కడ భారీ హోర్డింగులు ఏర్పాటు ప్రచారం ముమ్మరం చేసింది. పాత నగరంలోని 30 - 40 డివిజన్లలో ఏకపక్షంగా విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. వాటిపై ఇతర రాజకీయ పార్టీలేవీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. మిగిలిన దాదాపు 110 డివిజన్లపైనే ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి.
గ్రేటర్ పరిథిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు పెద్దసంఖ్యలో ఓటర్లుగా ఉన్నందున తమకు లాభిస్తుందని తెలుగుదేశం, బిజెపి కూటమి భావిస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సెటిలర్ల మనసు చూరగొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లంతా ఏదో ఒక పార్టీకే ఓటువేసే పరిస్థితి లేదని టిఆర్‌స్ అంచనా వేస్తోంది.
టిఆర్‌ఎస్ తరఫున గ్రేటర్‌లో ప్రచార బాధ్యత చేపట్టిన ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు. శిల్పారామంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. తెలంగాణ ఏర్పడితే ఏదో అయిపోతుందని గతంలో సాగించిన ప్రచారంవల్ల కొంత వ్యతిరేక భావన ఇతర ప్రాంతాల వారిలో ఉన్నా 18 నెలల పాలనతో ఆ అభిప్రాయాన్ని పోగొట్టగలిగినట్టు మంత్రి తెలిపారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు సైతం టిఆర్‌ఎస్ పాలనపట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారని, వారు టిఆర్‌ఎస్‌కు ఓటువేస్తారని, తాము విజయం సాధిస్తామని కెటిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తామని కాంగ్రెస్ అంటోంది. పార్టీలోని అంతర్గత కలహాలు వారికి తలనొప్పిగా మారాయి. ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు దానం నాగేందర్ హైదరాబాద్‌కే పరిమితం కావాలని, గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డిలో అడుగు పెడితే సహించేది లేదని ఆ జిల్లా నాయకులు హెచ్చరించారు. ఇటీవల దానం, వైరివర్గాల మధ్య ఘర్షణలూ జరిగాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టిడిపి ప్రభావం క్రమంగా క్షీణిస్తూ పోతోంది. వరంగల్ ఎంపి స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆ పార్టీకి కనీసం డిపాజిట్ దక్కలేదు. మండలి ఎన్నికల్లో టిడిపి ఊసే లేకుండా పోయింది. గ్రేటర్‌పై టిడిపి మొదటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నా మారిన పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. మొత్తంగా టిఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది.












Click it and Unblock the Notifications