ఇద్దరిలో ఒక్కడు: జీహెచ్‌ఎంసీ కార్మికుడికి జాతీయ గుర్తింపు, ఎవరీ వెంకటయ్య?
హైదరాబాద్: విధి నిర్వహణలో సామాజికి హితాన్నే నమ్ముకున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడికి జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులుగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని ఎంపిక చేయగా ఆ ఇద్దరిలో జీహెచ్‌ఎంసీ కార్మికుడు ఒకరు ఉన్నారు.
నీతి, నిజాయితీ, కష్టపడేతత్వం, సెలవులు పెట్టకుండా సక్రమంగా విధులు నిర్వర్తించడం తదితర అంశాలే ఆయనకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టాయి. అతనెవరో కాదు గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ బాబుల్‌రెడ్డి నగర్, రాఘవేంద్రకాలనీలలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఆయన నిబద్ధత, సమయపాలన, పని విధానాన్ని పరిగణలోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి ఉత్తమ కార్మికుడిగా గుర్తించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదించారు. ఇలాంటి ప్రతిపాదనలు దేశంలోని వివిధ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల నుంచి కూడా అందాయి.
వీటన్నింటిని పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇద్దరిని ఉత్తమ కార్మికులుగా గుర్తించింది. ఇందులో జీహెచ్‌ఎంసీ కార్మికుడు వెంకటయ్య, కోయంబత్తూర్‌కు చెందిన మరో కార్మికుడు ఉన్నారు. కేంద్ర మున్సిపల్, పట్టణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్న 'స్వచ్ఛ సర్వేక్షణ్' కార్యక్రమంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా వెంకటయ్య అవార్డును అందుకోనున్నారు.
ఈమేరకు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. రాజేంద్రనగర్ సర్కిల్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న వెంకటయ్య గగన్‌పహాడ్ నివాసి. వృత్తిపట్ల చూపే నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయం. పారిశుద్ధ్య కార్మికుడిగా వెంకటయ్యది 16 ఏళ్ల సర్వీసు. విధుల్లో చేరినప్పటి నుంచి ఆయన ఇప్పటివరకు సెలవే పెట్టలేదు.

చెత్తాచెదారం.. మురుగు నిర్వహణ పనుల్లో దుర్గంధాన్ని తట్టుకునేందుకు మందు చుక్క పడాల్సిందే అంటారు. అయితే విధుల్లో ఉండగా వెంకటయ్య ఎన్నడూ మద్యం సేవించలేదని సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మురికివాడగా ఉన్న బాబుల్‌రెడ్డినగర్‌ను చెత్త కుండీలు లేని కాలనీగా ఏర్పాటు చేయడంతో పాటు వంద శాతం ఇళ్ల నుంచి చెత్తను సేకరించేవాడని చెప్పారు.
బాబుల్‌రెడ్డి నగర్‌లో మొన్నటిదాకా చెత్తకుండీలు, గార్బెజ్‌లతో అక్కడికి వెళితే దుర్గంధంతో ముక్కుపుటలు అదిరిపోయవి. కానీ ఇప్పుడు అ పరిస్థితి లేదు. బాబుల్‌రెడ్డినగర్, దానిపక్కనే ఉన్న సాయిబాబానగర్ బస్తీలో ఆరు చెత్తకుండీలు, 24వరకు గార్బెజ్ స్థలాలు ఉన్నాయి. వీటన్నింటిని తొలగించడంలో వెంకటయ్య కీలకంగా వ్యవహరించారు.
స్వచ్ఛ హైదరాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అనంతరం ఆరు బయట చెత్త వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించారు. దీంతో పాటు ఏయిర్‌టెక్ మిషన్లు లేకున్నా డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంలో వెంకటయ్య కీలకపాత్ర వహించాడు. తాను పనిచేసే ప్రాంతాల్లో ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించినా విసుక్కోకుండా తొలగించేవాడు.
అలా చెత్త వేయవద్దని ప్రజలకు చెప్పడంతో వారిలో స్పష్టమైన మార్పు కనిపించింది. అలాగే అధికారులు యువజన సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలతో చేపట్టిన పనుల్లో వ్యక్తిగత ఆసక్తితో పాల్గొన్నారు. పనిపట్ల వెంకటయ్య చిత్తశుద్ధిని గమనించిన రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ కూడా పలుమార్లు ప్రశంసించారు.












Click it and Unblock the Notifications