గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ షాక్... వారి ఆస్తులు సీజ్!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ వాసులకు షాక్ ఇస్తుంది. పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు రెడీ అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరుకుపోయిన పన్ను బకాయిలను వసూలు చేయడంలో భాగంగా కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. జిహెచ్ఎంసి అధికారులు మొండి బకాయిదారులపైన కొరడా ఝుళిపిస్తున్నారు.
ఆస్తులను సీజ్ చేస్తున్న జీహెచ్ఎంసీ
ముందు నోటీసులు జారీ చేసి అప్పటికి స్పందించని వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు. మార్చి 31వ తేదీ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేయాలనే టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా చర్యలు చేపట్టారు జిహెచ్ఎంసి అధికారులు. ఇప్పటివరకు దాదాపు 1500 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. టార్గెట్ చేరుకోవడానికి అందుకు తగిన ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు.

డిస్ట్రెస్ వారెంట్ నోటీసులు జారీ చేసి స్పెషల్ డ్రైవ్
ఇంకా ఆరు లక్షల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నవారికి డిస్ట్రెస్ వారెంట్ నోటీసులు జారీ చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పన్ను వసూళ్లలో వేగం పెంచిన అధికారులు జిహెచ్ఎంసి కి ఆస్తి పన్ను, బకాయి పడ్డ పన్ను చెల్లించని 200 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. ఇక జిహెచ్ఎంసి కి ఆస్తి పన్ను బకాయి పడిన వాటిలో పలు ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి.
వారికి భారీ మొత్తంలో జరిమానాలు
నివాస భవనాల పేరుతో అనుమతి తీసుకుని కమర్షియల్ పర్పస్ లో ఉపయోగిస్తున్న భవనాలు, యజమానుల పైన ప్రత్యేక దృష్టి సారించిన జిహెచ్ఎంసి అధికారులు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు డొమెస్టిక్ భవనాల పేరుతో అనుమతులు తీసుకొని కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి పైన గట్టిగానే దృష్టిపెట్టారు.
వన్ టైం సెటిల్మెంట్ కోసం ఎదురుచూస్తున్న బడా పన్నుల చెల్లింపుదారులు
ఇదిలా ఉంటే కోట్ల రూపాయల బకాయిలు ఉన్నవారు జిహెచ్ఎంసి వన్ టైం సెటిల్మెంట్ కోసం ఏదైనా అవకాశం ఇస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చర్యలకు గ్రేటర్ హైదరాబాద్ వాసులు షాక్ తింటున్నారు. బకాయిలు చెల్లించని మొండి బాకీదారులు ఇప్పుడు జీహెచ్ఎంసీ తీరుతో అలెర్ట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications