భార్యతో కలిసి ప్రియురాలిని చంపేశాడు, నగలు కూడా
హైదరాబాద్: తన భార్యతో కలిసి ప్రియురాలిని చంపేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు అపహరించి, కేసును తప్పుదోవ పట్టించే యత్నంలో చివరకు పోలీసులకు దొరికిన సంఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్‌లో జరిగింది. పరిగిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ వెల్లడించిన కేసు వివరాలిలా ఉన్నాయి.
దోమ మండలం ఐనాపూర్‌కు చెందిన గార్లపల్లి లక్ష్మి(30), వెంకటయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మి ఈ నెల 16న ఉదయం గ్రామ శివారులోని పొలాలో హత్యకు గురై కనిపించింది. స్ధానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు.
మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు, గ్లాస్‌లు పడిఉండడంతో గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మికి మద్యం తాగించి అత్యాచారం చేసి ఉండొచ్చని తొలుత భావించారు. ఆమె ఒంటిపై అభరణాలు కనిపించకపోవడంతో దుండగులు ఆమెను చంపేసి నగలు అపహరించారనే కోణంలో కూడా అనుమానించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తులో లక్ష్మి వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్యకు గురైందని తెలిపారు. లక్ష్మీకి గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వరుసకు మరిది అయ్యే గార్ల భీమయ్య (32)తో వివాహేతర సంబంధం ఉంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లి అతడిని కలిసేది.
ఈ విషయం తెలుసుకున్న భీమయ్య భార్య అమృతమ్మ భర్తతో గొడవ పడింది. అక్రమ సంబంధం మానకపోతే చచ్చిపోతానని అమృతమ్మ భర్తను హెచ్చరించింది. దీంతో భార్యకు భీమయ్య సర్ధిచెప్పి లక్ష్మిని చంపేద్దామన్నాడు. ఈనెల 15న తెల్లవారుజామున లక్ష్మి ఎప్పటిమాదిరిగా బహిర్భూమికి వెళ్తున్నట్లు భర్త వెంకటయ్యకు చెప్పి ఇంటి నుంచి నేరుగా భీమయ్య ఇంటికి వెళ్లింది.
ఆయన భార్య అమృతమ్మ ‘మా ఇంటికి ఎందుకు వచ్చావ'ని లక్ష్మితో గొడవపడింది. ఆ సమయంలో భీమయ్య ఇంట్లో లేడు. వెంటనే తమ పధకం గుర్తుకువచ్చి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. లక్ష్మిని ఇంట్లోనే ఉంచాలని భార్యకు చెప్పిన భీమయ్య వెంటనే ఇంటికి వచ్చాడు. లక్ష్మిని మధ్యాహ్నం వరకు తమ ఇంట్లోనే బంధించి కల్లు తాగించారు.
ఎక్కువగా కల్లు తాగిన లక్ష్మీని ఇంట్లోనే పడుకోబెట్టి, భార్యభర్తలు పొలానికి వెళ్లి వచ్చారు. పొలం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మికి ఇంకా ఎక్కుువగా మద్యం తాగించారు. దీంతో ఆమె నిద్ర పోయింది. అర్ధరాత్రి పొద్దుపోయాక అమృతమ్మ లక్ష్మీ కాళ్లను గట్టిగా పట్టుకోగా, వెంకటయ్య టవల్‌ను గొంతుకు బిగించి చంపేశాడు.
ఆ తర్వాత లక్ష్మీ మృతదేహాన్ని గ్రామ శివారులోని పొలాల్లో పడేసిన భార్యభర్తలు లక్ష్మీ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, వెండి కడియాలు అపహరించి ఇంటికి వచ్చారు. ఇక కేసును తప్పుదోవ పట్టించేందుకు మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు, గ్లాస్‌లు పడేశారు.
పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారంటే, ఆమె హత్యకు గురైన రోజు ఏం జరిగిందనే గ్రామస్తులతో ఆరా తీశారు. 15వ తేదీన అమృతమ్మ, వెంకటయ్య దంపతులు పక్కింటి పిల్లలతో రెండుసార్లు మద్యం తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈ కోణంలో భార్యాభర్తలను ఆరా తీయగా వారు చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో తామే చంపేశామని నేరం అంగీకరించారు. నిందితులను రిమాండుకు పంపారు.












Click it and Unblock the Notifications