గో బ్యాక్ రాజయ్య; ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు షాకిచ్చిన గ్రామస్తులు!!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ లు సైతం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పని చేయడానికి రంగంలోకి దిగారు. అయితే చాలాచోట్ల బి ఆర్ ఎస్ నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు నేడు నిరసన సెగ తగిలింది. రఘునాథపల్లి మండల రామన్నగూడెం లో ఆయన పర్యటిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

ఇప్పటివరకు ఏం చేసావ్ అని.. మళ్లీ వస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మూకుమ్మడిగా ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు.
దీంతో గ్రామస్తులు పోలీసులను సైతం నిలదీశారు. మేము ఓటు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే మా సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, అందుకు తాము నిరసన వ్యక్తం చేస్తే తప్పా అంటూ గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించారు. చివరికి పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు.
ఇదేవిధంగా చాలాచోట్ల బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పనితీరు నచ్చని స్థానికులు ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు వ్యతిరేకంగా ఎంఐఎం నేతలు ఆందోళన చేశారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలన్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్నాయి.












Click it and Unblock the Notifications