కేసీఆర్‌కు దేవుడే శిక్ష విధిస్తాడు: కోమటిరెడ్డి, 'ముందు మంత్రులతో తాగించండి'
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కాకుండా, రౌడీల తెలంగాణ రూపదిద్దుకుంటోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ రూ. 10 లక్షల కోట్లకు హామీలిచ్చారని, కానీ ఆయన ఒక్కటీ నేరవెర్చలేదని ధ్వజమెత్తారు.
కుర్చీలు వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ సోఫా వేసుకుని ఫాం హౌస్‌లో పడుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోవడంలేదని, ప్రచార ఆర్భాటాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు.
ప్రజలకు ఓపిక నశించి తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటేవిలాసవంతమైన కార్లు, వసతులతో జల్సా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, దేవుడు అన్నీ గమనిస్తున్నాడని, సీఎం కేసీఆర్‌ను తప్పక శిక్షిస్తాడని ఆయన తెలిపారు.

చీప్ లిక్కర్ పాలసీపై కాంగ్రెస్ నేతలు మండిపాటు
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న చీప్ లిక్కర్ పాలసీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కమిషన్ల కోసమే చీప్ లిక్కర్‌ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు విమర్శించారు. చీప్ లిక్కర్ తాగితే ఆయుష్షు పెరుగుతుందంటున్న సీఎం కేసీఆర్ ముందుగా మంత్రులతో చీప్ లిక్కర్ తాగించాలని ఎద్దేవా చేశారు. చీప్ లిక్కర్, గుడాంబాను ఆరికట్టే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications