బంగారు తాపడంతో మెరిసిపోనున్న యాదాద్రి ఆలయ విమాన గోపురం!
తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాన్ని గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకే తలమానికంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యాదాద్రి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంకల్పించారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
ఈ క్రమంలో వరుసగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి యాదాద్రి దేవాలయ అభివృద్ధికి సంబంధించిన అనేక పనులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఆలయ అభివృద్ధి పనులకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

బ్రహ్మోత్సవాల నాటికి బంగారం తాపడం పనుల పూర్తికి ఆదేశం
యాదాద్రి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో కొండ సురేఖ ఆ పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు బంగారు తాపడం పనుల బాధ్యతను m/s స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించినట్టు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి బంగారం తాపడం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆలయ విమాన గోపుర బంగారం తాపడం పనులకు ప్రత్యేక కమిటీ
2025 మార్చిలోపే ఈ పనులను పూర్తి చేయాలని, బ్రహ్మోత్సవాలకు ఈసారి బంగారు విమాన గోపురం ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని కొండా సురేఖ ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను మొదలుపెట్టనున్నారు. ఇక పనులను నిర్వహించడానికి దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం రెండు వేరువేరు జీవోలను జారీ చేసింది .
కమిటీ చైర్మన్ గా శైలజ రామయ్యర్
దేవాలయ విమాన గోపురానికి బంగారం తాపడం పనులను నిరంతరం పర్యవేక్షించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ను చైర్పర్సన్ గా నియమించారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కన్వీనర్ గా, ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ సలహాదారు, వైటిడిఏ వైస్ చైర్మన్ జీ. కిషన్ రావు, యాదగిరిగుట్ట దేవస్థానం నిర్వహణ అధికారి, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది .
బంగారు తాపడం పనులను పర్యవేక్షిస్తూ సూచనలు
ఇక ఈ కమిటీ దేవాలయ విమాన గోపురానికి చేసే బంగారు తాపడం పనులను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.
ఇక ఇదే క్రమంలో భద్రాచలంలోని శ్రీ రాముల వారి దేవాలయ అభివృద్ధి విస్తరణ పనులకు కూడా భూసేకరణ చేయడానికి అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.












Click it and Unblock the Notifications