రూ.531కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లతో.. ఆ ప్రాంత దశ మార్చనున్న సీఎం రేవంత్!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలను నిర్వహిస్తున్న క్రమంలో నేడు నర్సంపేటలో ఈ విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
నర్సంపేట దశను మార్చేలా సీఎం రేవంత్ పర్యటన
రేవంత్ రెడ్డి వరుసగా ప్రజాపాలన విజయోత్సవ సభలలో పాల్గొంటూ ఆయా జిల్లాల దశను మార్చేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్న వేళ నేడు రేవంత్ రెడ్డి పర్యటన నర్సంపేట నియోజకవర్గం దశను మార్చే పర్యటన అని స్థానికంగా చర్చ జరుగుతుంది.

531 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సుమారు 531 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు నర్సంపేట చేరుకోనున్న సీఎం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాలలో కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు చేసే దిశగా తొలి అడుగు వేయనున్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ నిర్మాణాలకు శంకుస్థాపన
నర్సంపేట నియోజకవర్గంలో 531 కోట్ల రూపాయల అభివృద్ధి పనులలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, 130 కోట్ల రూపాయలతో నర్సంపేటలో మెడికల్ కళాశాల భవనం, 25 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. వీటి ద్వారా విద్యార్థులకు యువతకు ఉన్నత వృత్తివిద్య అవకాశాలను కల్పించడమే కాకుండా నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత వైద్య సేవలను కూడా అందించనున్నారు.
నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
స్థానికంగా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశాలను సృష్టించనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నర్సంపేట మధ్య 82.5 కోట్లతో నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ రోడ్డు ప్రయాణ సమయాన్ని తగ్గించి రవాణాను మెరుగుపరుస్తుంది. నర్సంపేటలో సిసి రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులు కూడా ఈ నిధులతో ఏర్పాటు చేయనున్నారు.
నర్సంపేట బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
పట్టణ సుందరీకరణకు, భద్రతకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. శంకుస్థాపన అనంతరం నర్సంపేటలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మరిన్ని అభివృద్ధి పథకాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో నర్సంపేట నియోజకవర్గం ప్రజలు నేడు సీఎం పర్యటన తమ ప్రాంత రూపురేఖలు మారుస్తుందని, అనేక అభివృద్ధి పథకాలు వస్తాయని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications