రైతులకు భారీ శుభవార్త.. మీ ఖాతాలలోకి డబ్బులు!
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సందడి కనిపిస్తుంది. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారు. పౌరసరఫరాల సంస్థ నిర్దేశించిన లక్ష్యం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 8,465 కొనుగోలు కేంద్రాలలో, మొత్తం 10,434 రెవిన్యూ గ్రామాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వేగంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ళు
ఇప్పటికే రాష్ట్రంలో 8361 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై రైతులకు సేవలను అందిస్తున్నాయి. నిన్నటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు మొత్తం 41.52 లక్షల టన్నుల ధాన్యం చేరింది. ఇందులో 22. 86 లక్షల టన్నులు దొడ్డు రకం ధాన్యం కాగా, 18.6 లక్షల టన్నులు సన్నరకం ధాన్యం. ఇప్పటివరకు ప్రభుత్వం అంచనా వేసిన ధాన్యంలో నుంచి ప్రభుత్వం 35.9 ఆరు లక్షల టన్నులను కొనుగోలు చేసింది.

ధాన్యం మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్న సర్కార్
ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం వెంటనే చెల్లింపులను కూడా చేస్తోంది. రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరతో పాటు బోనస్ కూడా కలిపి 6668.63 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ధాన్యాన్ని నిల్వ చేయడానికి, తరలించడానికి కూడా అధికారులు చురుకుగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు చేసిన 35.96 లక్షల టన్నుల ధాన్యంలో 35.39 లక్షల టన్నులను రైస్ మిల్లులకు తరలించగా 2750 టన్నుల ధాన్యం గోదాములలో నిల్వ చేశారు.
నవంబర్ లో ధాన్యం కొనుగోళ్లలో జోరు
ఇంకా 54 వేల 251 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్లో కొనుగోళ్ళ ప్రక్రియ అక్టోబర్ నెలలో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో నవంబర్లో ధాన్యం కొనుగోళ్లు అసాధారణంగా వేగవంతమైన పరిస్థితి కనిపించింది.
రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు
ఈసారి ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో కూడా లారీల కొరత లాంటి సమస్యలు లేకుండా పౌర సరఫరాల సంస్థ తగిన ఏర్పాట్లను చేసింది. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడడం కోసం ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు.
సన్నరకం ధాన్యానికి బోనస్ జమ
ఎప్పటికప్పుడు వచ్చే ఇబ్బందులను తెలుసుకొని తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు చెల్లిస్తూ అండగా నిలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం సన్నరకం ధాన్యానికి బోనస్ 500 రూపాయల చొప్పున చెల్లిస్తోంది.












Click it and Unblock the Notifications