తెలంగాణ ఉద్యోగులకు త్వరలో శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. త్వరలోనే ఐఈఆర్, పీఆర్సీ ప్రకటన సహా ఈహెచ్ఎస్‌పై కీలక ప్రకటనలుంటాయని వెల్లడించారు.
వీటి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని.. ఉద్యోగులు, జేఏసీ నేతలకు వెల్లడించారు. ఉద్యోగుల జేఏసీ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగ సంఘాల నేతలతో పలు అంశాలపై చర్చించారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో పీఆర్సీ(PRC), ఐఈఆర్(IER) గురించి విన్నవించగా సానుకూలంగా స్పందించారని.. శాసనసభావేదికగా ప్రకటించారని గుర్తు చేశారు. ఆగస్టు 15న గోల్కొండ కోటలోను ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వీ మమతలు మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉద్యోగుల సేవలను అసెంబ్లీ వేదికగా గుర్తుచేసి ఈహెచ్‌ఎస్, ఐఆర్, పీఆర్సీలపై ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ వెన్నంటి ఉంటామని, బాసటగా నిలుస్తామని ఈ సందర్భంగా నేతలు తీర్మానించారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, కృష్ణాయాదవ్, వెంకట్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి చెప్పిన మాటలతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications