తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్ధికశాఖ!!
నిరుద్యోగులకు ఊరట కల్పిస్తూ, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న జాబ్ నోటిఫికేషన్ల నిర్ణయంతో ఇప్పటికే నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయని సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు? దానికి కావలసిన విద్యార్హతలేమిటి? చదవలసిన సబ్జెక్టులు ఏమిటి అన్న దానిపై నిరుద్యోగులు పెద్ద కసరత్తే చేస్తున్నారు.

తెలంగాణా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్ధిక శాఖ
తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తొలివిడతగా 30 వేల 453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 3,334 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇందుకు సంబంధించిన జీవోలను కూడా జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ.
ఫైర్ సర్వీసు, అటవీశాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ లో ఖాళీలను భర్తీ చేయడానికి అనుమతినిచ్చింది. దీంతో నిరుద్యోగులలో సంతోషం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 80 వేల 39 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

అటెండర్ నుండి ఆర్టీవో వరకు అన్ని ఉద్యోగాల భర్తీకి కెసీఆర్ నిర్ణయం
అటెండర్ నుండి ఆర్టీవో వరకు స్థానికులకే అవకాశం ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సమయంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పటి వరకు లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామనిపేర్కొన్న కెసిఆర్22 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇంకా లక్ష 50 వేల ఉద్యోగాలను నోటిఫై చేశామని వెల్లడించారు. మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయనిసీఎం కేసీఆర్ వెల్లడించారు.

జాబ్ నోటిఫికేషన్స్ తో సీరియస్ ప్రిపరేషన్ లో నిరుద్యోగులు
రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా 80,039 ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్న కేసీఆర్ వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని,స్థానికులకే అవకాశం ఇస్తామని తేల్చిచెప్పారు.సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్లకు, ఉచిత శిక్షణ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. పోలీస్ శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో జిల్లాల వారీగా జిల్లా యువకులకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు. ఇక ఇప్పటికే యూనివర్సిటీ లైబ్రరీలు, లైబ్రరీలలో ఉద్యోగార్ధులు సీరియస్ గా చదువుతున్నారు.

ఉద్యోగాల భర్తీ నేపధ్యంలో కిటకిటలాడుతున్న కోచింగ్ సెంటర్లు
కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఉచిత శిక్షణ ఇచ్చే అభ్యర్థుల కోసం అర్హత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించగా 6500 మంది యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారు అంటే, జిల్లాల వారీగా ఎంత పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పోలీస్ శాఖ నుండి కాదు ఇతర శాఖల్లోనూ నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో నిరుద్యోగులు ప్రిపరేషన్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. పలు అకాడమీలు కిటకిటలాడుతున్నాయి. ఎలాగైనా జాబ్ కొట్టాలన్న తపనతో కష్టించి చదువుతున్నారు.












Click it and Unblock the Notifications