యూరియా విషయంలో తెలంగాణా రైతులకు కేంద్రం శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉందని తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను దక్షిణ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రైతులకు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి యూరియాను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
యూరియా కోసం రేవంత్ ఆగ్రహం
తెలంగాణ పైన కేంద్రం వివక్ష చూపిస్తోందని, ముఖ్యంగా రైతులు విషయంలో యూరియా కొరత దానిని నిరూపిస్తుంది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేటాయించిన వాటా మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయకపోవడంతో రాష్ట్రంలో తలెత్తుతున్న సమస్యలను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులకు వివరించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

యూరియా కోసం కేంద్రానికి రేవంత్ డిమాండ్
ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ను కేటాయించినప్పటికీ ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని, దీనివల్ల రైతులకు ఇబ్బంది కలుగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కానీ రాష్ట్ర అవసరాల మేరకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపుతోందని అన్నారు. తమ రాష్ట్రానికి అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
యూరియా కోసం పోరుబాట పడతామన్న కాంగ్రెస్ నేతలు
ఇక సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటాను తక్షణమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు యూరియా కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాతల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
స్పందించిన కేంద్రం... యూరియా సరఫరాకు ఆదేశం
ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రైతులకు ఊరట కలిగించేలా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం, త్వరలోనే తెలంగాణకు పంపనుంది. ఇక ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు కేంద్రం ఆదేశించినట్టు, వారం రోజుల్లో తెలంగాణకు యూరియా రాబోతుందని మంత్రి తుమ్మల శుభవార్త చెప్పారు.












Click it and Unblock the Notifications