తెలంగాణా రైతులకు శుభవార్త!!
తెలంగాణా రైతాంగానికి శుభవార్త చెప్పింది తెలంగాణా ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం, రైతన్నకు అండగా నిలబడటం కోసం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో రైతుబంధు కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రైతు బంధు పథకంలో భాగంగా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు కేసీఆర్.
ఈ క్రమంలో నేటి నుంచి మళ్లీ పదకొండో విడత రైతుబంధు నగదు రైతుల ఖాతాలలో జమ కానుంది. నేటి నుండి ఆన్లైన్ ద్వారా రైతులందరికీ బ్యాంకు ఖాతాలలో రైతుబంధు నగదును ప్రభుత్వం జమ చేయనుంది. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఎకరానికి పదివేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ రైతన్నకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పదకొండో విడతకు సంబంధించి 70 లక్షల మంది రైతులకు రైతుబంధు సహాయాన్ని అందిస్తామని తెలిపారు. అంతేకాదు ఈ సంవత్సరం పాడి రైతులకు కూడా రైతుబంధు అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. మొత్తం 1.5 లక్షల మంది పాడి రైతులకు కూడా రైతుబంధు అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.54 కోట్ల ఎకరాల సాగుకు అర్హులైన రైతులందరికీ 7720. 29 కోట్ల రూపాయల నగదు రైతుల ఖాతాలలో జమ కానుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐదు లక్షల మంది కొత్త వారికి రైతు బంధు సహాయం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 10 విడతల నగదు రైతుల ఖాతాల్లో జమ కాగా ఆ మొత్తం 65 వేల 190 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

పోడు భూముల రైతులకు నాలుగు లక్షల మందికి కూడా రైతుబంధు ఇవ్వనున్నారు. ముందుగా ఒక ఎకరం భూమి ఉన్నవారికి, ఆ తర్వాత 2 ఎకరాలు, ఐదు ఎకరాలు భూములు ఉన్నవారికి రైతుబంధు ఇవ్వనున్నారు. దీంతో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరియనుంది. ఇక మరోవైపు జూన్ 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.












Click it and Unblock the Notifications