సన్న బియ్యం మాటెలా ఉన్నా...: కుమ్రం భీం జిల్లాలో దుస్థితి

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇంట్లో మనుమడు తినే సన్న బియ్యంతో కూడిన భోజనమే రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు పెట్టాలని ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు మొదలు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వరకు అధికార టీఆర్ఎస్ నాయకులంతా అదే పనిగా చెప్తున్నారు.

కానీ ఆచరణలో రాష్ట్రంలోని రమారమీ 2500 సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న భోజనం, కల్పిస్తున్న వసతులు చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలే అసౌకర్యాలు.. ఆపై అటకెక్కిన ఆహారపట్టికతో గిరిజన విద్యార్థుల చదువులు అర్ధాకలితోనే కొనసాగుతున్నాయి. నీళ్లతో పోటీపడుతూ ఉడికీఉడకని పుప్పు, రుచిలేని కూరలతో విద్యార్థులకు ముద్ద దిగడం నిత్య నరకంగా మారింది. గిరిజన వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని చెప్తున్నారు.

అవస్థల మధ్య గురుకులాల ప్రారంభం

ఏటా పలు అవస్థల మధ్య ఆశ్రమ పాఠశాలలు ప్రారంభం కావడంతో గిరిజన సంక్షేమం గాడి తప్పుతోంది. అక్షరం గిరి విద్యార్థులకు అందనంత దూరంలో ఉండడంతో ప్రజల జీవన ప్రమాణాలు ఏటీకేడు పాతాళానికి దిగజారుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఆహార పట్టిక విషయంలో గిరిజన అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఆయా వసతి గృహ, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వడం లేదు. ప్రస్తుతం పెంచిన మెస్‌ ఛార్జీలకు అనుగుణంగా నూతన ఆహార పట్టిక అమలు చేయడానికి అవసరమైన సరకుల పంపిణీ, ఆదేశాలు ఏవీ సంబంధిత హెడ్ మాస్టర్లకు రాక వసతిగృహాల్లో వార్డెన్లు పెట్టిందే ఆహారంగా మారింది.

Government failure to facilities in Welfare Hostels

దీంతో ఇష్టానుసారంగా విద్యార్థులకు భోజనాలను పెడుతున్న వార్డెన్లు, నూతన ఆహార పట్టిక ప్రకారం విద్యార్థులకు బిల్లులు పెడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు కుమ్రం భీం - అసిఫాబాద్ జిల్లాలో 60 ఫ్రీమెట్రిక్‌ వసతిగృహాల్లో 13 వేల మంది విద్యార్థులు, 11 పోస్టు మెట్రిక్‌ వసతిగృహాల్లో 800 మంది విద్యార్థులు, 12 కస్తూర్బా వసతి గృహాల్లో 2,300 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

పాల ఊసే ఎత్తొద్దు సుమా

నిత్యం వసతి గృహ విద్యార్థులకు బూస్ట్‌తో కూడిన పాలు అందించాలి. పాల సరఫరా నేటికీ ప్రారంభం కాక విద్యార్థులకు ఇవ్వడం లేదు. నిత్యం ఉదయం అల్పాహారంలో భాగంగా కేవలం కిచిడీ, రసం మాత్రమే పెడుతున్నారు. మధ్యాహ్నం కూరగాయాల ఫ్రైతో కూడిన అన్నం, కందిపప్పు, సాంబార్‌తో కూడిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. కానీ నీళ్ల పప్పుచారుతోనే విద్యార్థులకు భోజనం పెడుతున్నారు.

Viral Speech Of Revanth Reddy on CM KCR

ప్రస్తుతం ఏడో తరగతి వరకు చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.950 మెస్‌ ఛార్జీలు అందిస్తుండగా, ఎనిమిది నుంచి పది వరకు రూ.1100 అందిస్తున్నారు. ఇంటర్‌ తరగతులకు రూ.1500 అందిస్తున్నారు. వీటితోపాటు కాస్మోటిక్‌ వస్తువులు బాలురకు రూ.75 విలువ చేసేవి, బాలురకు రూ.115 చొప్పున సరఫరా చేస్తున్నారు. కాస్మోటిక్‌ వస్తువులు ఏ విద్యార్థికి నేటికీ అందక స్నానానికి, దుస్తులు శుభ్రం చేయడానికి బాలబాలికలు అవస్థల పాలవుతున్నారు.

Government failure to facilities in Welfare Hostels

పాత్రలే లేవు.. ఎలా చేసేది..

నూతన ఆహారపట్టిక ప్రకారం వారంలో ఉదయం సమయంలో ఇడ్లీ, చపాతి, పూరి, బొండాలను విద్యార్థులకు అల్పాహారంలో భాగంగా అందించాలి. ఇడ్లీ పాత్రలు ఇంకా ఏ వసతిగృహానికి అందించకుండా ఎలా ఇడ్లీలు చేసేదని వార్డెన్లు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు మేక మాంసం, పాల సరఫరాకు సైతం టెండర్లు పూర్తి కాలేదు. వసతిగృహాల్లో ఇద్దరు ముగ్గురు ఉన్న వంటమనుషులు వందల మంది విద్యార్థులకు అవసరమయ్యే చపాతీలు, పూరీలు చేయడం అసాధ్యం. జిల్లాలోని బాలికల వసతి గృహాలు, కస్తూర్బా వసతి విద్యాలయాల్లో విద్యార్థినులతోనే పూరీలు, ఇడ్లీలు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నూతన ఆహార పట్టిక అమలయ్యేది అనుమానమేనని భావిస్తున్నారు.

పెట్టిందే తినాలి

తిర్యాణి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా నీళ్లతో కూడిన భోజనం సరఫరా చేశారు. హాస్టల్‌కు సరఫరా అయిన కందిపప్పు పూర్తి నాసిరకంగా ఉండడం వల్ల ఎంత సమయం ఉడికించినా ఉడకడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. జైనూర్‌ మండలం పట్నాపూర్‌లో ఉన్న గిరిజన బాలికల వసతిగృహంలో 400 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. శనివారం మధ్యాహ్న భోజనంలో నీళ్లతో కూడిన పప్పును మాత్రమే విద్యార్థినులకు ఇవ్వడం వల్ల తినలేక, పస్తులు ఉండలేక అమ్మాయిలు అర్దాకలితోనే కడుపు నింపుకున్నారు.

వాంకిడి మండలం కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో 42 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం మాత్రం కేవలం 10 మంది విద్యార్థులే ఉన్నారు. శనివారం గుడ్డుకు బదులుగా స్వీటు ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వలేదు. వంట మనిషి సైతం లేక వార్డెన్‌తోనే వంట కానిచ్చేశారు. దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా వసతి గృహం సమస్యలకు నిలయమైంది. 250 మంది విద్యార్థినులు ఉండే ఈ వసతిగృహంలో మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక, కొన్నింటికి తలుపులు లేకపోవడం విద్యాధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఆహార పట్టిక సైతం అస్తవ్యస్తంగా ఉంటుందని, పుస్తకాలు సైతం పంపిణీ కాలేవని విద్యార్థినులు వాపోయారు.

ఉన్నతాధికారులకు నివేదించాం

ఆహార పట్టిక అమలు విషయంలో నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఏటీడబ్ల్యూవో కనకదుర్గ చెప్పారు. విద్యార్థులకు కాస్మోటిక్‌ వస్తువులను ఈ నెలాఖరులోగా సరఫరా చేస్తామని తెలిపారు. కొన్ని హాస్టళ్లలో చికెన్‌, మటన్‌ అందిస్తున్నామని అయితే మటన్‌ సరఫరాకు కాలేదని ఏటీడబ్ల్యూవో కనకదుర్గ చెప్పారు. పాలు సరఫరా చేయడానికి టెండర్లు పూర్తికాగానే అన్ని వసతి గృహాలకు పంపిణీ చేస్తామని ఏటీడబ్ల్యూవో కనకదుర్గ వివరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Government had said high level facilities in welfare hostels but there is no minimum facilities while requirements not followed. Schools started after One month also there is no arrangements here.
Please Wait while comments are loading...