జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు - నేడే ఉత్తర్వులు : సందేహాలు-ఉత్కంఠ..!!
అనేక తర్జన భర్జలన తరువాత కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అవుతోంది. జిల్లాల వారీగా ఉద్యోగులను కేటాయిస్తూ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఉద్యోగుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరికి ఏ జిల్లాకు కేటాయిస్తారో అనే అంశం పైన స్పష్టత లేక..ఆందోళనలో ఉన్నారు. తెలంగాణలోని అయిదు వేల ప్రధానోపాధ్యా యులు మినహా...1.04 లక్షల మంది టీచర్లు అందరూ జిల్లా కేడర్ కిందకే వస్తారు. సీనియారిటీకి కాకుండా స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వాళ్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోలేదు.

అనేక సందేహాల మధ్య కేటాయింపు
దీంతో సీనియర్లు కోరుకున్న ప్రాంతానికి, జూనియర్లు ఇష్టం లేకున్నా కేటాయించిన ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు వాపోతున్నారు. ఉపాధ్యాయులను జిల్లాకు కేటాయించినా ఆ జిల్లాలో వాళ్లను ఏ స్కూలుకు కేటాయిస్తారు.., ఏ ప్రాతిపదికన నియమిస్తారనే అంశం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, విద్యా సంవత్సరం మధ్యలో ఈ నిర్ణయాల అమలు సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా విభజించారు. ఉద్యోగుల విభజన తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

విభజన అంశమే ఆందోళనగా
అయితే విభజన అంశమే పెద్ద ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. 1975లో లోకల్ క్యాడరైజేషన్ చేసిన తర్వాత ఉద్యోగులను పనిచేస్తున్న స్థానాల్లో కొనసాగించారని, 2006లో కొందరు స్థానికేతరులను వారి జిల్లాలకు తరలించారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. కనీసం కౌన్సెలింగ్ కూడా చేపట్టకుండా జూనియర్ టీచర్లను వేరే జిల్లాలకు పంపడాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానం వల్ల స్థానికేతర జిల్లాల వాళ్లు పట్టణ ప్రాంతాలకు వస్తారని, స్థానికులు మాత్రం సీనియారిటీ లేకపోవడం వల్ల సొంత ప్రాంతానికి, కుటుంబాలకు దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు.

మార్గదర్శకాలు వస్తేనే స్పష్టత వచ్చేది
సీనియారిటీ వల్ల ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది మారుమూల ఏజెన్సీ జిల్లాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని, వారు ఇప్పట్లో రిటైరవరు కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం దక్కదనే వాదన వినిపిస్తోంది. హెడ్ కానిస్టేబుల్‌ను జోనల్ పోస్టుగా చూపించిన అధికారులకు స్కూల్ అసిస్టెంట్‌పట్ల ఎందుకు పరిగణించటం లేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఈ రోజు జారీ చేసే ఆదేశాల్లో ఏ జిల్లాకు కేటాయింపు అనే అంశంతో ఆర్డర్లు జారీ చేస్తారు.
కానీ, ఏ టీచరు ఏ పాఠశాలలో పని చేయాలనేది జిల్లా విద్యా శాఖా అధికారులు నిర్ణయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ, ఈ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ కాకపోవటంతో కొంత అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం పైన ఉపాధ్యాయులు..సంఘాల నేతలు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాయి.












Click it and Unblock the Notifications