ఒక్కటే గుడ్డు పెడతారా: గవర్నర్ ఆగ్రహం, చెరువు తవ్విన కెసిఆర్
మహబూబ్ నగర్/కరీంనగర్: మహబూబ్ నగర్ జిల్లా కిషన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వారానికి ఒకే గుడ్డు పెట్టడం పైన గవర్నర్ నరసింహన్ సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారానికి ఒక రోజు మాత్రమే విద్యార్థులకు గుడ్డు పెడుతున్న విషయం తెలుసుకొని ఆగ్రహించారు. జిల్లా వ్యాప్తంగా ఎలా ఉందో ఆరా తీయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మధ్యాహ్న భోజన శాలలకు సబ్సిడీ గ్యాస్ అందేలా చూడాలని ఆదేశించారు.
గవర్నర్ నరసింహన్ కిషన్ నగర్ గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించిన గ్రామంలోని సమస్యలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహార వివరాలను సైతం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి యత్నం
ఫీజు రీయింబర్సుమెంట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంజారాహిల్స్‌లోని తెలంగాణ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ సోమవారం ధర్నా చేపట్టింది. వారు లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట తెలుగు మహిళల ధర్నా
తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టనున్న చీప్ లిక్కర్ పైన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం బీజేపీ మహిళా విభాగం మహిళా మోర్చా తెలంగాణ ఆబ్కారీ శాఖ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగింది. సోమవారం టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళా కార్యకర్తలు నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. గుడుంబాను అడ్డుకునేందుకు వేరే మార్గాలున్నాయన్నారు.
చిన్నముల్కనూర్‌లో సీఎం కేసీఆర్ శ్రమదానం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూర్‌లో సోమవారం పర్యటిస్తున్నారు. ఈ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. చెరువు వద్ద శ్రమదానం చేశారు. అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు.












Click it and Unblock the Notifications