గవర్నర్ విందుకు ఇద్దరు డుమ్మా: కెసిఆర్ ఇక్కడ, బాబు అక్కడ.. దూరం!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. ఈ విందుకు ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కెసిఆర్, ఇతర పార్టీలను ఆహ్వానించారు. అయితే, ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు లేవు.
ఇఫ్తార్ విందు ఈరోజు ఉంది. కానీ, చంద్రబాబు నాయుడు ఇంకా ఢిల్లీలో ఉన్నారు. ఆయన జపాన్ పర్యటన ముగించుకొని నేరుగా ఢిల్లీకి వచ్చారు. శుక్రవారం నాడు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఏపీకి కావాల్సిన వాటితో పాటు, తెలుగు రాష్ట్రాల గొడవ పైన ఆయన చర్చించారు.
ఈ నేపథ్యంలో విందుకు చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు లేవు. కొద్ది రోజులుగా ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8, నీటి గొడవ అంశాలతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

అప్పటి నుండి ఇద్దరు సీఎంలు మూడుసార్లు కలుసుకునే అవకాశం వచ్చినా కలవలేదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు కెసిఆర్ ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబు నిబంధనల కారణంగా స్వాగతం పలకలేదు. ఆ మరుసటి రోజు వెళ్లి ప్రణబ్‌ను కలిశారు.
అనంతరం ప్రణబ్ రాక సందర్భంగా గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చారు. ఈ విందుకు ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. కానీ కెసిఆర్ జ్వరం పేరు చెప్పి గైర్హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి కలుసుకునే అవకాశం వచ్చినా.. చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు, కెసిఆర్ కూడా విందుకు హాజరు కాలేదు.
గవర్నర్ విందుకు నాయిని, స్వామి గౌడ్, మధుసూధన చారి, కెఈ కృష్ణమూర్తి, కెటిఆర్ తదితరులు హాజరయ్యారు.
రాలేకపోతున్నానని గవర్నర్‌కు చంద్రబాబు
గవర్నర్ ఇస్తున్న విందుకు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు గవర్నర్ నరసింహన్‌ను కలుస్తానని చెప్పారు. గోదావరి పుష్కరాలకు ఆయనను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఆయన రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరి వస్తారు.












Click it and Unblock the Notifications