కేసీఆర్‌కు చిక్కులు: తలసానిని గవర్నర్ బర్తరఫ్ చేస్తారా?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ చిక్కుల్లో పడనున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ మంత్రి వర్గంలో మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను గవర్నర్ నరసింహాన్‌ను బర్తరఫ్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా తలసాని కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంత్రి తలసాని వ్యవహారంలో గవర్నర్ చాలా సీరియస్‌గా ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ, దాన్ని ఇంకా ఎంతకాలం పెండింగ్‌లో పెడతారంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారిని కూడా గవర్నర్ ప్రశ్నించారని తెలుస్తోంది.
ఈ వ్వవహారంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒకవేళ అలా జరగని పక్షంలో సీఎం కేసీఆర్‌చే తలసాని రాజీనామాను ఆమోదించేలా చేయించాలని గవర్నర్ కోరతారని అన్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన రాజకీయ పరిణామలపై నివేదిక సమర్పించేందుకు గవర్నర్ ఢిల్లీకి పలుమార్లు వెళ్లిన సంగతి తెలిసిందే.
తన ఢిల్లీ పర్యనటలో తలసాని అంశంపై కేంద్ర హోం శాఖ కూడా గవర్నర్‌ని ప్రశ్నించిందని తెలుస్తోంది. దీంతో తలసాని విషయంపై గవర్నర్ సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నగరంలోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి విడిదికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తలసానిపై ఆరా తీశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేనా? టీడీపీ తరుపున గెలిచిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలా పనిచేస్తారంటూ సాక్షాత్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరా తీశారంటే ఈ విషయంపై గవర్నర్ ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్ధం చేసుకోండి.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తలసాని టీడీపీ తరుపునే తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అదే విధంగా ఏయే పార్టీల నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారని రాష్ట్రపతి ప్రశ్నించారు.
టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తోన్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఫిరాయింపుదారుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాల్సి ఉంది. ఈ విషయమై స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసినా, అనారోగ్యం కారణంగా స్పీకర్ మధుసూధనాచారి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో ఫిరాయింపులపై రాష్ట్రపతికి టీడీపీ నేతలు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించి తగు చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని టీడీపీ బృందానికి రాష్ట్రపతి హామీ ఇచ్చారు.
గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్‌లోని సనత్ నగర్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున గెలుపొందారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా ఉన్నారు.
డిసెంబర్ 16వ తేదీన ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించినా, ఆయన రాజీనామాను ఆమోదించారా లేక తిరస్కరించారా? అనే అంశంపై స్పీకర్ మధుసూధనాచారి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ అంశంలో గవర్నర్ నేరుగా కల్పించుకోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications