రేవంత్ రెడ్డి చాలా ధైర్యవంతుడు: నరసింహన్, సార్ హరీష్ మాటేమిటి..
హైదరాబాద్: రైతులు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను సోమవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. గవర్నర్ నరసింహన్ టిడిపి యువనేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ధైర్యవంతుడిగా అభివర్ణించారు.
రేవంత్ రెడ్డి పైన గవర్నర్ నరసింహన్ ఈ ఆసక్తికర కామెంట్ చేయడం గమనార్హం. రైతుల రుణమాఫీపై కేసీఆర్ సర్కారు అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన అనంతరం తెలంగాణ టీడీపీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని చూసిన గవర్నర్... మొత్తానికి ధైర్యవంతుడివే అని వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కుర్చీని లాగిన రేవంత్ రెడ్డి ఘటనను ప్రస్తావించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
అయితే నాటి ఘటనలో అసలు విషయాన్ని చెప్పేందుకు యత్నించిన టీ టీడీపీ నేతలను గవర్నర్ వారించారు. తనకు రేవంత్ గురించి తెలుసునని, తన గురించి రేవంత్‌కు తెలుసునని, మీరు చెప్పనవసరం లేదని వ్యాఖ్యానించారు.
దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి... సార్ ఆ రోజు అసెంబ్లీలో నేనూ, హరీశ్ రావు ఇద్దరం కలిసి కుర్చీ లాగామని,కాని మీరు హరీశ్ రావును మరచిపోయి తనను మాత్రమే గుర్తు పెట్టుకొన్నారని వ్యాఖ్యానించారు. దానికి గవర్నర్ చిరునవ్వు నవ్వారు.












Click it and Unblock the Notifications