ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి : అధికారం ఉన్నా - అందుకే..!!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (7వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ సారి గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. అయిదు నెలల జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు కావటంతో.. గవర్నర్ ప్రసంగం లేదని చెబుతున్నారు. దీని పైన ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగించాయి. ఈ సమయంలో గవర్నర్ తమిళి సై స్పందించారు. ప్రభుత్వ తీరు పైన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.

సాంకేతిక కారణాలు చూపి
ప్రభుత్వం సాంకేతిక అంశాలను సాకుగా చూపి.. సంప్రదాయం ప్రకారం జరగాల్సిన గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. అయిదు నెలల తరువాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా అయితే ఇంత సుదీర్ఘ విరామం తర్వాత సభను కొత్త సెషన్‌తో ప్రారంభిస్తారని తమిళిసై తెలిపారు.
మునుపటి సెషన్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని.. సాంకేతిక కారణాలను చూపి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిందని పేర్కొన్నారు. వాస్తవానికి గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ కార్యాలయం తయారు చేయదు. అది ప్రభుత్వం రాసి ఇచ్చే ప్రకటనగా చెప్పుకొచ్చారు.

సభ్యులు అవకాశం కోల్పోతున్నారు
గతేడాది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విజయాలతోపాటు తదుపరి ఏడాదికి సంబంధించిన విధాన సూచికల ప్రగతి నివేదికే అంటూ తన ప్రకటనలో వివరించారు. సభలో గవర్నర్ ప్రసంగించే అంశాలపైన.. పాలనా వ్యవహారాల పైన చర్చకు అవకాశం కల్పించేందుకే గవర్నర్ ప్రసంగం అవకాశం కల్పిస్తుందన్నారు.
ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసి ప్రజాస్వామ్య సూత్రాలను పటిష్టం చేయడానికి సభ్యులకు ఉపయోగ పడుతుందని చెప్పారు. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రభుత్వ పనితీరు పైన చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్య ఆదర్శాలను పెంపొందించడం వరకే గవర్నర్ పాత్ర పరిమితమని వివరించారు.

ప్రభుత్వ నోట్ లో పేర్కొన్నది చూస్తే
బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. ఆ సమయంలో గవర్నర్ ప్రసంగంతోనే సభ ప్రారంభమవుతుందని తెలిపిందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. దీనిపై వివరణ కోరగా.. అనుకోకుండా జరిగిన తప్పిదం వల్ల అలా వచ్చిందంటూ ప్రభుత్వం నోట్ పంపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ, రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ.. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేశానన్నారు.

అధికారాలు ఉన్నా.. దానికే ప్రాధాన్యత
ఈ విషయంలో కావాల్సినంత సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉన్నా.. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలు ఉన్నా.. తన తొలి ప్రాధాన్యత రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాబట్టి.. ఏ మాత్రం ఆలస్యం చేయలేదని తమిళిసై స్పష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన బీజేపీ సైతం విమర్శలు చేసింది. వాటిని మంత్రులు తిప్పి కొట్టారు. ఇక, సభలోనూ దీని పైన ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications