ఈ భోజనం పశువులు కూడా తినవు.. అన్నం ప్లేట్లతో రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమానికి ఎన్నో చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి మెనూ ప్రకారం భోజనాన్ని ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ప్రభుత్వం చెబుతున్నదానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు అరా కొరా వసతులతో, పశువులు కూడా తినలేనటువంటి భోజనంతో నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతిరోజు నీళ్ల చారు, ఉడికీ, ఉడకని అన్నం తినలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు కొందరు స్కూల్ గేటు ముందు ధర్నా చేశారు. అన్నం ప్లేట్లతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హాస్టల్లో తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని పాఠశాల గేటు ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఉదయం అల్పాహారం కింద ఇడ్లీకి బదులు తెల్ల అన్నం, నీళ్ల చారు పెట్టారని అన్నం ప్లేట్లు పట్టుకొని నిరసన తెలిపారు. ఇలాంటి భోజనం మీ ఇంట్లో వాళ్లకు పెడతారా అంటూ ప్రశ్నించారు. తమకు ప్రతీరోజూ భోజనం నరకంగానే ఉంటుందని వాళ్ళు పేర్కొన్నారు. అన్నం ప్లేట్లతో ఈ భోజనం పశువులు కూడా తినవని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాదు ఫిబ్రవరి కాస్మోటిక్ చార్జీలు సుమారు 60,000 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించిన విద్యార్థులు తమ కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. మెనూ ప్రకారం నాలుగు సార్లు చికెన్, ఒకసారి మటన్ పెట్టాలి కానీ అవేవీ పాటించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థులు అన్నం ప్లేట్లు పట్టుకుని నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ తెలంగాణా గురుకుల హాస్టల్స్ లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ చర్చిస్తున్నారు.
ఈ భోజనం పశువులు కూడా తినవు.. అన్నం ప్లేట్లతో రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు..!!#TelanganaNews #Telangana #Oneindiatelugu pic.twitter.com/E8txonlSgw
— oneindiatelugu (@oneindiatelugu) March 24, 2023












Click it and Unblock the Notifications